Rajyasabha Kharge :  మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి మేఘ్వాల్, నారీశక్తి వందన్ పేరుతో మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. “2010లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. వెనకబడిన వర్గాల మహిళలకు కూడా అవకాశాలు దక్కాలి. అన్ని పార్టీలు మహిళలను చిన్నచూపు చూస్తున్నాయి. ప్రశ్నించలేని మహిళలకు అవకాశం ఇచ్చారు” అని ప్రసంగించారు. ఖర్గే మాటలతో బీజేపీ మహిళా నేతలు మండిపడ్డారు.  మహిళా నేతలను కించపరిచే విధంగా మల్లీఖార్జున ఖర్గే మాట్లాడుతున్నారని ఆయన ప్రసంగాన్ని బిజెపి నేతలు అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఖర్గే ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.


 ఖర్గే ప్రసంగం పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తుండడం తెలిసిందే. ఇవాళ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ నెల 21న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, రాజ్యసభలో ఖర్గే దీనిపై ప్రసంగించారు.   2010లోనే కాంగ్రెస్ సర్కారు మహిళా బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. వెనుకబడిన వర్గాల మహిళలకు కూడా అవకాశాలు దక్కాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు మహిళలను చిన్నచూపు చూస్తున్నాయని తెలిపారు.   ఖర్గే  వ్యాఖ్యలతో బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఆయన ప్రసంగం ఆపాలని పట్టుబట్టారు.చివరికి గందరగోళం ఏర్పడటంతో సభను వాయిదా వేశారు. 


అంతకు ముందు  కొత్త పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు.  ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం. భవిష్యత్‌ తరాలకు స్పూర్తినిచ్చేలా మనం పనిచేయాలి. నెహ్రు చేతికి శోభనిచ్చిన సెంగోల్‌ నేడు సభలో కొలువుదీరింది. స్వాతంత్ర్య ఉద్యమంతో సెంగోల్‌ది కీలక పాత్ర. అమృతకాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. కొత్త సభలోకి ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆజాదీ అమృత్‌ కాలంలో ఇది ఉషోదయ కాలం. వినాయక చతుర్థీ రోజు కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాం. ఆధునికతకు అద్దం పట్టడంతో పాటు చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్‌ భవనం. భవనం మారింది, భావనలు కూడా మారాలి. గత చేదు అనుభవాలను మరిచిపోవాలని సూచించారు.                              


భారత్‌ నేతృత్వంలో జీ20ని విజయవంతంగా నిర్వహించాం. మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. ఆటల నుంచి అంతరిక్షం వరకు మహిళలు ముందంజలో ఉన్నారు. మహిళా కోటా చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే భాగ్యం భగవంతుడు తనకు ఇచ్చారని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.