Rajkot Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గేమ్‌జోన్ అగ్ని ప్రమాదం (Rajkot Game Zone Fire Accident) దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లతో 9 మంది చిన్నారులన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి అసలు ఈ గేమ్‌జోన్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ గేమ్ జోన్‌లో అగ్నిప్రమాదానికి సంబంధించి NOC ఇంకా రావాల్సి ఉంది. ఈ సర్టిఫికేట్ రాకుండానే జోన్ ప్రారంభించారు. పైగా మొత్తం జోన్‌కి కేవలం ఒకే ఒక ఎగ్జిట్ ఉంది. మృతుల సంఖ్య ఎక్కువగా నమోదు కావడానికి ఇది కూడా ఓ కారణమే అంటున్నారు అధికారులు. వీకెండ్ కావడం, పైగా టికెట్ ధర కేవలం రూ.99 పెట్టడం వల్ల ఎక్కువ మంది వచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే... ప్రమాదానికి కారణమేంటన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
"ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటో ఇంకా స్పష్టత రాలేదు. మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బలమైన గాలులు వీస్తుండడం వల్ల మంటలు ఎగిసి పడుతున్నాయి. వీటిని ఆర్పడంలో మా ఆపరేషన్‌లో ఇదే సవాలుగా మారింది"
- అగ్ని మాపక అధికారులు
ఇక్కడ జరిగిన ప్రమాదం వల్ల కిలోమీటర్ల మేర పొగలు కమ్ముకున్నాయి. ఆ స్థాయిలో మంటలు చెలరేగాయి. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. DNA శాంపిల్స్ ద్వారా బాధితుల కుటుంబ సభ్యులకి అప్పగించే పనిలో ఉన్నామని వివరించారు. నిజానికి...ఈ గేమ్‌జోన్‌ని ఆపరేట్ చేసేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాజ్‌కోట్ మన్సిపల్ కార్పొరేషన్ అనుమతి ఇవ్వకుండానే ఇది మొదలైంది. మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని పట్టించుకోకుండా వదిలేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు మండి పడుతున్నారు. రాజ్‌కోట్ మేయర్ ఘటనా స్థలాన్ని పరీశించారు. గేమ్‌జోన్‌కి Fire NOC లేదని ధ్రువీకరించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఒక్కటే ఉండడంపైనా విచారణ జరుపుతామని వెల్లడించారు. ఈ కారణంగానే ప్రమాదం జరిగిన వెంటనే లోపలి వాళ్లు బయటకు రాలేకపోయారని వివరించారు. ఇప్పటికే ఈ గేమ్‌జోన్ మేనేజర్, ఓనర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుజరాత్‌లోని అన్ని గేమ్‌జోన్స్‌నీ పరిశీలించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనను గుజరాత్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది.
Also Read: Viral Video: కదులుతున్న ట్రక్‌లోని సరుకులు చోరీ, ధూమ్ రేంజ్ స్టంట్‌లు చేసిన దొంగలు - వైరల్ వీడియో