Rajasthan Congress Crisis: రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంలో సాగుతోన్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, పార్టీ నేత సచిన్ పైలట్‌ల మధ్య ఉన్న వివాదాలు జోడో యాత్రపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇద్దరూ కాంగ్రెస్‌కు చెందిన నేతలే. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ముందే అనుకున్నాం
యాత్ర ఇంతక ముందే చేసి ఉండాల్సింది అని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ ఆసక్తికర సమాధానమిచ్చారు.
సంవత్సరం క్రితమే యాత్ర కోసం ప్రణాళిక రూపొందించుకున్నాం. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా అమలు చెయ్యలేదు. భారత్ జోడో యాత్ర దేశ ప్రజల గొంతుకై ముందుకు సాగుతోంది. భారత దేశాన్ని పాలించడం చాలా కష్టమైన విషయం. అందరి అభిప్రాయాలు వింటూ ముందుకు సాగాలి. కానీ భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు చాలా కఠినంగా దేశాన్ని పాలిస్తున్నాయి. దేశంలో కొన్ని శక్తులు.. పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు ప్రైవేటు పరం చేస్తున్నాయి. విద్యా, వైద్యం.. ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి, వ్యాపారస్తుల చేతుల్లో కాదు - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
అదే లక్ష్యం
తనపై భాజపా నేతలు చేస్తోన్న వ్యక్తిగత విమర్శల గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. వ్యక్తిగత విమర్శలు వస్తున్నాయంటే మనం లక్ష్యం చేరుకుంటున్నామని అర్థమని రాహుల్ అన్నారు.
భాజపా సమస్య ఏంటంటే నా పేరు, పరువు, ప్రతిష్టలు నాశనం చెయ్యడానికి ఎన్ని కోట్ల రూపాయలు అయిన ఖర్చు చేస్తుంది. నిజం ఎప్పటికీ దాగదు అని నేను నమ్ముతాను. ఒక వ్యక్తి రాజకీయ వైఖరి వల్ల వ్యక్తిగత దాడులు జరుగుతాయి. ఒక పెద్ద శక్తిని ఎదుర్కొంటున్నప్పుడు వ్యక్తిగత దాడులు జరుగుతాయి. అవి మనం సరైన మార్గంలో సాగుతున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తాయి. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
2024 లోక్ సభ ఎన్నికల్లో అమేఠీ నుంచే పోటీ చేస్తారా అని అడగగా ఈ ప్రశ్నకు సమాధానం ఒకటి, ఒకటిన్నర సంవత్సరాల తర్వాత తెలుస్తుందని రాహుల్ అన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా భారత్ జోడో యాత్రపై మాత్రమే ఉందని సమాధానమిచ్చారు.
Also Read: Bhagat Singh Koshyari: రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర గవర్నర్- వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి!