Bhagat Singh Koshyari: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ విషయమై గవర్నర్ కోష్యారీ తన సన్నిహితులతో మాట్లాడినట్లు సమాచారం. ఛత్రపతి శివాజీపై గవర్నర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్, శివసేన (ఠాక్రే వర్గం)లు.. గవర్నర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.
మరో వివాదం
ఈ వివాదంతో ఉక్కిరిబిక్కిరైన గవర్నర్.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. 26/11 ముంబయి ఉగ్రదాడుల అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించే సమయంలో గవర్నర్ తన పాదరక్షలను తీయలేదని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.
నవంబర్ 26న దక్షిణ ముంబయిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీ వివాదం
ఛత్రపతి శివాజీ ఐకానిక్ పర్సనాలిటీ అయినా అదంతా పాత రోజుల్లోనని...ఇప్పటి ఐకానిక్ పర్సనాలిటీస్ వేరే ఉన్నారని గవర్నర్ ఇటీవల అన్నారు. ఔరంగాబాద్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అండేక్కర్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలోనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
" ఒకప్పుడు భారత్‌లో ఐకాన్ లాంటి వ్యక్తులెవరంటే నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ అని సమాధానం ఇచ్చేవారు. కానీ...మహారాష్ట్ర ఈ విషయంలో ప్రత్యేకం. ఇక్కడ ఎంతో మంది గొప్ప వ్యక్తులున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఒకప్పటి ఐకాన్. కానీ ఇప్పుడు అంబేడ్కర్, నితిన్ గడ్కరీ ఆ స్థాయిలో ఉన్నారు. "
ఈ వ్యాఖ్యలతో మహారాష్ట్రలోని విపక్షాలన్నీ గవర్నర్‌పై విమర్శల దాడి మొదలు పెట్టాయి. విపక్షాలతో పాటు సీఎం శిందే నేతృత్వంలోని శివసేన వర్గం కూడా ఆయనను విమర్శించాయి.
Also Read: Viral Video: స్టన్నింగ్ వీడియో- బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు ఎక్కించాడు!