ఆర్.ఆర్.ఆర్ మూవీ విజయంతో మాంచి ఊపు మీదున్న రామ్ చరణ్.. అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సనతో కలిసి మూవీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై అభిమానుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం కలవరం వ్యక్తం చేస్తున్నారు. మంచి బ్లాక్‌బస్టర్ కథతో చరణ్ సినిమాను తెరకెక్కించాలని బుచ్చిబాబును రిక్వెస్ట్ చేస్తున్నారు. 


ఇప్పటికే రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ మూవీకు సంబంధించి వస్తోన్న లేటెస్ట్ అప్డేట్స్ మెగా అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. ఆ సినిమాలో ఒక్క పాట కోసం ఏకంగా రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇక శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మెగా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్. తన 16వ సినిమా గురించి అప్డేడ్ ఇస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 


గతంలో గౌతమ్ తిన్ననూరి తో రామ్ చరణ్ 16వ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో రామ్ చరణ్ బుచ్చి బాబుకు ఛాన్స్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ‘‘బుచ్చిబాబు, అతని టీమ్ తో కలసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అంటూ రామ్ చరణ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కనుందని టాక్. 



ఈ సినిమాపై దర్శకుడు బుచ్చిబాబు కూడా ట్వీట్ చేశారు. కొన్నిసార్లు, తిరుగుబాటు అవసరంమని పోస్ట్ చేశారు. మరి ఆ తిరుగుబాటు ఏమిటనేది త్వరలోనే తెలుస్తుంది.









బుచ్చిబాబు, దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. తరువాత దర్శకుడిగా మారి ‘ఉప్పెన’ సినిమాను తెరకెక్కించారు. తన మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ను అందుకున్నారు బుచ్చిబాబు. ఇప్పుడు రామ్ చరణ్ తో కలసి భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాతో కిలారు సతీష్ నిర్మాతగా మారనున్నారు. వృద్ధి సినిమా బ్యానర్ పై ఈ మూవీను నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మైత్రి మూవీ బ్యానర్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా నిర్మాణ భాగస్వాములుగా పని చేస్తున్నాయి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఇప్పటినుంచే అంచనాలు మొదలైయ్యాయి. 


Also Read: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!