Rajasthan Congress Crisis: 'గహ్లోత్ ఇలా చేశారా? అసలు నమ్మలేకపోతున్నాను'- సోనియా గాంధీ అసంతృప్తి!

ABP Desam Updated at: 27 Sep 2022 12:30 PM (IST)
Edited By: Murali Krishna

Rajasthan Congress Crisis: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీరుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

(Image Source: PTI)

NEXT PREV

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. పరిస్థితులను చక్కబెట్టేందుకు రాజస్థాన్ వెళ్లిన కాంగ్రెస్ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ సోమవారం దిల్లీలో సోనియా గాంధీని కలిశారు. రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభం గురించి ఆమెకు తెలియజేసారు.


సోనియా షాక్!


ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వైఖరి పట్ల కాంగ్రెస్ అధినేత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు ఏబీపీ న్యూస్‌కి తెలిపాయి.


"అశోక్ గహ్లోత్ ఇలా చేశారా? గహ్లోత్ నుంచి ఇది ఊహించలేదు" అని సోనియా గాంధీ సమావేశంలో రాజస్థాన్ ఇంచార్జ్ అజయ్ మాకెన్, ఖర్గేలకు చెప్పినట్లు సమాచారం. రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభంపై మంగళవారంలోగా లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని సోనియా గాంధీ కోరారు.



నేను కాంగ్రెస్ అధినేత్రికి మొత్తం వివరించాను. ఆమె వివరణాత్మక నివేదికను కోరారు. నేను ఆమెకు నివేదిక అందజేస్తాను                            - అజయ్ మాకెన్, కాంగ్రెస్ సీనియర్ నేత 


అధ్యక్ష రేసులో


గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరున్న అశోక్ గహ్లోత్.. అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తారని సోనియా, రాహుల్ గాంధీ అసలు ఊహించలేదు. ఒకవైపు భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా నడుస్తోందని.. కాంగ్రెస్‌ కార్యకర్తల్లో పునరుత్తేజం కలిగిస్తోందని పార్టీ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా తాము ఎంపిక చేయాలనుకున్న నాయకుడే ధిక్కార వైఖరి అవలంబించడంపై వారు ఆగ్రహంతో ఉన్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.


గాంధీ కుటుంబం చేతిలో పార్టీ పగ్గాలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి రాజస్థాన్‌ పరిణామాలే తార్కాణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారట. అందుచేత ఇకనైనా రాహుల్‌ మనసు మార్చుకుని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీనియర్‌ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 


పోటీలో లేను


రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మంగళవారం ఆమె నివాసంలో కలవడానికి ముందు కమల్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.



నాకు (కాంగ్రెస్) అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదు. సోనియా గాంధీకి నవరాత్రి శుభాకాంక్షలు చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. -                                             కమల్‌నాథ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం


అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా గహ్లోత్ తీరుతో అధిష్ఠానం చిక్కుల్లో పడింది.  గహ్లోత్‌ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్ వద్దని, గహ్లోత్ వర్గీయుడే ఉండాలని ముఖ్యమంత్రికి మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇప్పటికే 90 మంది వరకు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి స్పీకర్ సీపీ జోషికి అప్పగించారు. 


ఒక వ్యక్తికి ఒకే పదవి ఫార్ములా ఫాలో కావాలని గహ్లోత్‌కు అధిష్ఠానం సూచించింది. దీంతో కనీసం స్పీకర్ సీపీ జోషిని సీఎం చేయాలని గహ్లోత్ అడిగారట. తన రాజకీయ ప్రత్యర్ధి సచిన్ పైలట్‌ను మాత్రం సీఎం చేయడానికి వీల్లేదని గహ్లోత్ చెప్పినట్లు సమాచారం. కానీ అధిష్ఠానం సచిన్ పైలట్‌ను సీఎంగా చేయాలని యోచిస్తుందని తెలుసుకున్న గహ్లోత్ తన వర్గం ఎమ్మెల్యేలను తన వైపే ఉండేలా చూసుకున్నారు.


Also Read: Ratan Tata: రతన్ టాటా 'సక్సెస్' మంత్రం ఇదే! ఆ మాటలు వినడంలో ఉన్న కిక్కే వేరప్పా!


Also Read: PFI Raids: 'ఆపరేషన్ PFI'- 8 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ, ఈడీ దాడులు ముమ్మరం

Published at: 27 Sep 2022 12:17 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.