Rajasthan BJP MLA:
లంపీ స్కిన్ సమస్యను చెప్పేందుకే..
రాజస్థాన్‌లో భాజపా ఎమ్మెల్యే సురేష్ సింగ్ రావత్ ఇటీవల అసెంబ్లీకి ఆవును పట్టుకుని వచ్చారు. లంపీ స్కిన్ ( Lumpy Skin Disease)వ్యాధితో పశువులు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇలా ఆవును అసెంబ్లీకి తోలుకుని వచ్చారు సురేష్ సింగ్. అయితే..ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగు పెట్టకముందే...అది అక్కడి నుంచి పారిపోయింది. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడు తుండగా ఉన్నట్టుండి అక్కడి నుంచి పరుగులు తీసింది ఆవు. పలుపు తాడు పట్టుకున్న వ్యక్తి ఆవుని కట్టడి చేసేందుకు ప్రయత్నించినా...అది ఆగకుండా వేగంగా పారిపోయింది. అయితే...ఈ ఘటననూ తనకు అనుకూలంగా మలుచుకున్నారు రావత్. కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ దొతాస్రాకు బదులిస్తూ.."ప్రభుత్వ తీరుతో ఆవులు కూడా కోపంగా ఉన్నాయి" అని కామెంట్ చేశారు. అసెంబ్లీకి ఆవుని తీసుకొచ్చిన సమయంలో చేతిలో కర్ర పట్టుకుని మీడియాతో రావత్ మాట్లాడారు. ఆవులు లంపీ స్కిన్ వ్యాధితో బాధ పడుతున్నాయని, కానీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. "ప్రభుత్వం దృష్టిని ఈ సమస్య వైపు మరల్చేందుకే...విధాన సభకు నేను ఆవుని తీసుకుని వచ్చాను" అని చెప్పారు రావత్. పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం...ఈ నెల 19వ తేదీన 59 వేలకుపైగా పశువులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. ఇప్పటికే 13 లక్షల పశువులకు ఈ వ్యాధి సోకింది.
Also Read: Ant Research: ఈ భూమి మీద మొత్తం ఎన్ని చీమలున్నాయో తెలుసా?