Madhurapudi Airport: రాజమండ్రి: ఉభయ గోదావరి జిల్లాలకు ఎంతో ప్రధానమైన రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం అభివృద్ధి పనులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులను ఇక్కడికి వచ్చి ప్రారంభించనున్నారని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ (Rajahmundry MP Bharat Margani) తెలిపారు. 


ఎంపీ మార్గాని భరత్ శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం రాజమండ్రి విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులు రూ.347.15 కోట్లతో చేపడుతున్నట్టు ఎంపీ వెల్లడించారు. ‌ఏనాటికైనా రాజమండ్రి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ స్థాయి విమానాశ్రయంగా చూడాలనేది పెద్ద కోరిక అని, మన రాజమండ్రి నుంచే ఢిల్లీ, ముంబయి, గోవా, కేరళ.. ఇలా అన్నిచోట్లకు వెళ్ళేలా ఫ్లైట్స్ ఉండాలని ఆకాంక్ష అన్నారు. లోక్ సభ సభ్యునిగా ఎన్నికైన నాటి నుంచీ ప్రయత్నించగా ఇన్నాళ్ళకు ఆ కల సాకారం అవుతోందని ఎంపీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిరోజు రాజమండ్రి నుంచి గల్ఫ్ దేశాలకు 150- 200 మంది రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ‌టెర్మినల్ విస్తరణ, ఆధునికీకరణ, అభివృద్ధి పనులతో రాజమండ్రి విమానాశ్రయం సర్వాంగ సుందరంగా కనిపిస్తుందన్నారు. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో ఈ పనులన్నీ పూర్తి కావచ్చుననే ఎంపీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మురళీధరన్, అలాగే రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాధ్ తదితర ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారని వైసీపీ ఎంపీ భరత్ తెలిపారు.
Also Read: గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు - వృథాగా నీళ్లు, ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు 


Also Read: Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్‌ క్లోజ్‌