Manipur Violence: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించారు. అక్కడ రిలీఫ్ క్యాంప్‌లలో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. దాదాపు ఏడాదిగా మణిపూర్‌తో కుకీ, మైతేయి వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గతేడాది మే 3వ తేదీన మొదలైన ఈ అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు కాల్పులకు పాల్పడుతున్నారు. రాళ్ల దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ అక్కడ పర్యటించారు. రాహుల్ మణిపూర్‌లో పర్యటించడం ఇది మూడోసారి. సహాయక శిబిరాల్లోని బాధితులతో ఆయన మాట్లాడారు. రాహుల్ రాకపై బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా రిలీఫ్ క్యాంప్‌లోనే ఉంటున్నామని కొందరు ఆవేదన చెందారు. వాళ్లందరితోనూ మాట్లాడిన రాహుల్ ధైర్యం చెప్పారు. కచ్చితంగా పార్లమెంట్‌లో దీనిపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనపై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఒక్కసారైనా మణిపూర్‌లో పర్యటించాల్సిందని, ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని తేల్చి చెప్పారు. మణిపూర్ భారత్‌లో అంతర్భాగమే అని, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండి పడ్డారు. మోదీ కనీసం ఒకటి రెండు రోజులు ఇక్కడికి వచ్చి ప్రజల ఆవేదన ఏంటో వినాలని అన్నారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
దేశభక్తులంతా రావాలి: రాహుల్
ఘర్షణలు మొదలయ్యాక మణిపూర్‌కి మూడోసారి వచ్చానని, పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందని ఆశించినా ఇక్కడ అదేమీ కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. అన్ని శిబిరాలకూ వెళ్లి బాధితులతో మాట్లాడినట్టు వివరించారు. కేవలం వాళ్ల మనోవేదనను వినడానికే తాను ఇక్కడికి వచ్చానన్న ఆయన ప్రభుత్వం వెంటనే చొరవ చూపించి ఇక్కడి హింసను తగ్గించాలని డిమాండ్ చేశారు. వేలాది కుటుంబాలు ఈ గొడవల కారణంగా అవస్థలు పడుతున్నాయన అన్నారు. తాను ఇక్కడికి ఓ సోదరుడిగా వచ్చానని, సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గవర్నర్‌తోనూ ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్టు చెప్పారు రాహుల్ గాంధీ. ఏడాదిగా ఇక్కడ హింసను తగ్గించేందుకు చేపట్టిన చర్యలపై తాము అసంతృప్తిగా ఉన్నామని స్పష్టం చేశారు. తమను తాము దేశభక్తులుగా చెప్పుకునే వాళ్లంతా మణిపూర్‌కి రావాలని పరోక్షంగా బీజేపీ నేతలకు చురకలు అంటించారు. వీలైనంత త్వరగా ఇక్కడి సమస్యల్ని పరిష్కరించాలని కోరారు.