Rahul Gandhi Bharat Jodo Yatra:


జోడో యాత్ర-2


రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 ని త్వరలోనే ప్రారంభించనున్నారు. జనవరి రెండో వారం నుంచి ఈ యాత్ర మొదలు కానుంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకూ ఇది కొనసాగనుంది. ఢిల్లీలో జరిగిన CWC మీటింగ్‌లో భారత్ జోడో యాత్ర గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రస్తావించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోకస్‌భ ఎన్నికల ముందు ఈ యాత్ర చేస్తే పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోంది హైకమాండ్. పైగా కార్యకర్తల్నీ ఎన్నికల ముందు సన్నద్ధం చేసినట్టవుతుంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ డీలా పడింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ మరోసారి ఆత్మపరిశీలనలో పడింది. లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ రెండోసారి జోడో యాత్ర నిర్వహించనున్నారు. గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన ఫస్ట్ ఫేజ్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి మొదలైంది. దాదాపు 12 రాష్ట్రాల మీదుగా 4 వేల కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగిసింది. దాదాపు 136 రోజుల పాటు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేశారు. 


అయితే...ఫస్ట్ ఫేజ్‌లో పూర్తిగా పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. ఈ సారి మాత్రం హైబ్రిడ్ మోడ్‌లో సాగనుంది. అంటే...కొంత దూరం వరకూ నడక ద్వారా ఆ తరవాత వాహనాల్లో యాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్న వివరాల ప్రకారం...ఈ యాత్ర ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ చేయనుంది. రాహుల్‌తో పాటు మరి కొందరు కీలక నేతలూ ఈ యాత్రలో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటోంది కాంగ్రెస్. ఇదే సమయంలో పలు చోట్ల బహిరంగ సభలనూ ఏర్పాటు చేయనున్నారు.