Rahul Gandhi PM Candidate:
పార్టీ ఆవిర్భావ దినోత్సవం..
కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనుందని అన్నారు. ఈ వేడుకల్లో I.N.D.I.A కూటమి కీలక నేతలూ పాల్గొన్నారు. వాళ్ల ముందు రాహుల్ ప్రధాని అవ్వాలని మాట్లాడడమే చర్చకు దారి తీసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేదికపైనే ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గేని ప్రధానిగా చూడాలంటూ ఇప్పటికే కొందరు ప్రతిపాదించారు. ఇప్పుడా ప్రతిపాదనకు భిన్నంగా సిద్దరామయ్య రాహుల్ పేరు ప్రస్తావించారు.
"దేశంలో చాలా సమస్యలున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించగలిగే సామర్థ్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. అది జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి. ఆయన రెండోసారి జోడో యాత్ర చేస్తున్నారు. దీనికి భారత్ న్యాయ్ యాత్ర అని పేరు పెట్టారు. ఈ దేశంలో ఏ రాజకీయ నేత కూడా భారత్ జోడో యాత్ర లాంటి యాత్రను చేయలేదు. దేశంలో వెనకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలు, మహిళలకు న్యాయం జరగాలి. అందుకే రాహుల్ రెండోసారి యాత్ర చేపడుతున్నారు"
- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
విభేదాలు పక్కన పెట్టి..
అందరూ విభేదాలు పక్కన పెట్టి దేశం కోసం ఒక్కటవ్వాలని సూచించారు సిద్దరామయ్య. రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరముందని, అందరికీ న్యాయం అందించాలని అన్నారు. కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కూడా సిద్దరామయ్య ఇవే వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రధాని అవ్వాలని ఆకాంక్షించారు. అయితే...పార్టీ వేడుకల్లో హిందుత్వ గురించీ ప్రస్తావించారు సిద్దరామయ్య. తమను తాము సాఫ్ట్ హిందుత్వగా చెప్పుకున్నారు. తానూ హిందువునేనని, గ్రామాల్లో భజనలు చేసినప్పుడు తానూ వెళ్లేవాడినని అన్నారు.
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ని కాస్త డీలా పడేలా చేశాయి. లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది ఆ పార్టీ. ఇప్పటికే విపక్ష కూటమిలోనే కీలక నేతలతో సమావేశమైంది. ఈ సమయంలోనే ప్రధాని అభ్యర్థి ఎవరన్న చర్చ వచ్చింది. కొంత మంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రస్తావించారు. దీనిపైనే నితీశ్ కాస్త అలక వహించినట్టు సమాచారం. లోపల ఎవరెవరు ఏం మాట్లాడారు అన్నది స్పష్టత లేకపోయినా ప్రధాని అభ్యర్థి విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపైనే రాహుల్ గాంధీ నితీశ్ కుమార్‌కి కాల్ చేసి మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కూటమిలోని కొందరు నేతలకు, నితీశ్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిపాయి. కూటమి పేరుని I.N.D.I.A అని కాకుండా Bharat గా మార్చాలని కొందరు ప్రతిపాదించారు. దీనిపై నితీశ్ కుమార్ కాస్త గట్టిగానే వాదించారట. నితీశ్ కుమార్‌ని మీడియా చాలా సార్లు ప్రధాని అభ్యర్థి గురించి ప్రశ్నించింది. "మీరు ప్రధాని అభ్యర్థిగా ఉంటారా" అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చారు నితీశ్ కుమార్. పెద్దగా ఆసక్తి లేదన్న సంకేతాలిచ్చారు. అయితే..కూటమిలో మాత్రం తనను తాను ప్రధాని అభ్యర్థిగా చెప్పుకుంటున్నట్టు సమాచారం.
Also Read: Covid Cases in India: 24 గంటల్లో 5గురు మృతి,ఆందోళన పెంచుతున్న కొత్త వేరియంట్