Rahul Gandhi:


పోలీసుల విచారణ 


శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్రలో రాహుల్ వ్యాఖ్యలపై విచారణ పూర్తి చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా దీనిపై స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు రాహుల్ మరి కొంత సమయం అడిగినట్టు వివరించారు. జోడో యాత్రలో ఎంతో మందిని కలిశానని, ఎవరు ఏం చెప్పారో గుర్తు చేసుకోవడానికి సమయం కావాలని కోరినట్టు వెల్లడించారు. 


"రాహుల్ గాంధీతో సమావేశమయ్యాం. మేం అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాచారం ఇవ్వడానికి మరి కొంత సమయం కావాలని అడిగారు. ప్రస్తుతానికి మేం ఆయనకు నోటీసులు జారీ చేశాం. ఆ నోటీసులకు ఆయన అంగీకరించారు. ఒకవేళ మరోసారి ప్రశ్నించాల్సి వస్తే మేం అందుకు అనుగుణంగానే నడుచుకుంటాం. భారత్ జోడో యాత్రలో ఎంతో మందిని కలిశానని రాహుల్ చెప్పారు. మేం అడిగిన వివరాలను తప్పకుండా ఇస్తానని అన్నారు. ఆ తరవాతే మా ప్రొసీడింగ్స్‌ కొనసాగుతాయి"


- సాగర్ ప్రీత్ హుడా, ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్










కాంగ్రెస్ ఆగ్రహం..


దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాలతోనే ఢిల్లీ పోలీసులు రాహుల్ ఇంటికి వచ్చారని మండి పడింది. అమిత్‌ షా ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ ఆరోపించారు. ఈ విచారణ పూర్తైన వెంటనే  రాహుల్ తన ఇంటి నుంచి వెళ్లిపోయారు. మీడియా ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నించినా...ఆగలేదు. 


"అమిత్‌ షా ఆదేశాలివ్వకుండా ఇదంతా జరిగేదే కాదు. ఏ కారణం లేకుండా పోలీసులు ఇలా రాహుల్ ఇంటికి ఎందుకు వచ్చారు? ఇప్పటికే నోటీసులు ఇచ్చారని రాహుల్ చెప్పారు. అందుకు సమాధానం ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. అయినా పోలీసులు లోపలకు వచ్చారు"


- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి