రాష్ట్రంలో అకాల వర్షాలపై సీఎం వైఎస్ జగన్‌ సీఎంఓ అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు.


వెంటనే ఎన్యుమరేషన్‌


పంట నష్ట పరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎన్యుమరేషన్‌ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.


తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు


ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణాలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ సంస్థ తెలిపింది. ఐఎండి అంచనాల ప్రకారం తమిళనాడు నుండి మధ్యప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మరియు విదర్భ మీదుగా ద్రోణి కొనసాగుతుందని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్  డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.దీని ప్రభావంతో  ఆదివారం నాడు కూడా కాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో  పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.


సోమవారం కూడా వర్షాల ప్రభావం..


శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం నాడు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.


పిడుగు పాటుపై అలర్ట్..


రాష్ట్రంలో  విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు పొలాల్లో పనిచేసే కూలీలు, పశువులు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉంకుండా జాగ్రత్తలు పాటించాలని, పశువులను సైతం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


నమోదైన వర్షపాతం వివరాలు


శుక్రవారం ఉదయం  8.30 గం.ల నుండి శనివారం ఉ.8.30గం.ల వరకు తిరుపతి జిల్లా  నాగలాపురం మండలంలో 73.5 మిమీ, బాపట్ల జిల్లా రేపల్లెలో 48.75 మిమీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో  47.25మిమీ, చిత్తూరు జిల్లా నగరిలో 44.5 మిమీ, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూర్ లో 41.5 మిమీ, గుంటూరు జిల్లా  ప్రత్తిపాడులో 26.25 మిమీ,  ప్రకాశం జిల్లా కనిగిరిలో 26.5 మిమీ, వైఎస్సార్ జిల్లా చాపాడులో 24.75 మిమీ వంతున జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటిచింది.


వర్షాల్లోనే సీఎం పర్యటన..


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వర్షాల్లోనే ఆయన పర్యటన కొనసాగుతుంది. వర్షాల నేపథ్యంలో సభకు భారీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు సైతం సీఎం సభకు తరలించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. తిరువూరులో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.