కేంద్రంపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ


అగ్నిపథ్ పథకంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్కీమ్‌ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని కొందరు విమర్శిస్తుంటే, విదేశాల్లో ఉన్నదేనని ఇంకొందరు సమర్థిస్తున్నారు. కేంద్రం ఎంత వివరణ ఇస్తున్నా, విమర్శలు మాత్రం ఆగటం లేదు. అటు ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయంపై భగ్గుమంటున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఇదే అంశమై కేంద్రంపై విమర్శలు గుప్పించారు. "నో ర్యాంక్, నో పెన్షన్" అన్నదే అగ్నిపథ్ పథకం ఉద్దేశమని ఎద్దేవా చేశారు. ఉద్యోగం సాధించినా వాళ్లకు ఆ ప్రయోజనాలు దక్కవని, అదే అగ్నిపథ్ పథకంలోని గొప్పదనం అంటూ సెటైర్లు వేశారు. 


బయటకు వచ్చాక నిరుద్యోగులుగా ఉండాల్సిందే-రాహుల్ గాంధీ


"ఒకప్పుడు భాజపా వన్ ర్యాంక్, వన్ పెన్షన్ గురించి మాట్లాడింది. ఇప్పుడేమో నో ర్యాంక్, నో పెన్షన్ అని కొత్త విధానం తీసుకొస్తోంది" అని విమర్శించారు. నాలుగేళ్ల పాటు సర్వీస్‌లో ఉంచుకుని, తరవాత వారిలో 75% మందిని తీసేస్తామంటే వారికి ఉపాధి అవకాశాలు ఎలా లభిస్తాయంటూ ప్రశ్నించారు. వాళ్లు చాన్నాళ్ల పాటు నిరుద్యోగులుగానే ఉండిపోయే ప్రమాదముందని అన్నారు. యువకులు ఎంతో శ్రమించి సర్వీస్ చేస్తే వాళ్లు బయటకు వెళ్లాక ఎలాంటి ఉద్యోగాలు రావని వ్యాఖ్యానించారు. ఇలాంటి నిర్ణయాలతో దేశ సైన్యాన్ని బలహీన పరుస్తున్నారని,పైగా భాజపా నేతలు తమను తాము జాతీయవాదులుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇది రద్దయ్యే వరకూ పోరాడతామని అని వెల్లడించారు రాహుల్ గాంధీ. 


జూన్ 14న కేంద్రం ఈ పథకం గురించి ప్రకటించినప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్‌లోనూ పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అటు బిహార్‌లోనూ ఆందోళనలు చెలరేగాయి. అయితే కేంద్రం మాత్రం ఈ పథకంపై ఎలాంటి అపోహలు అవసరం లేదంటూ వివరణ ఇచ్చింది. అగ్నిపథ్‌లో భాగంగా ఎంపికైన అగ్నివీరులు సర్వీస్‌లో ఉండగా అమరులైతే వారికి కోటి రూపాయల పరిహారం దక్కుతుందని స్పష్టం చేసింది. సియాచెన్‌తో సహా మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పని చేసే సైనికులతో సమానంగా అగ్నివీరులకూ ప్రాధాన్యత దక్కుతుందని వెల్లడించింది.


ఈ విషయంలో అగ్నివీరులపై ఎలాంటి వివక్ష ఉండదని చెప్పారు లెఫ్ట్‌నెంట్ జనరల్ అనిల్ పూరీ. ప్రస్తుతానికి అగ్నిపథ్‌లో భాగంగా 46 వేల మందిని తీసుకుంటున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను 1.25 లక్షలకు పెంచుతామని తెలిపారు. వచ్చే నాలుగైదేళ్లలో క్రమంగా ఈ సంఖ్యను 50 వేలు, 60 వేలకు పెంచుతామని, ఆ తరవాత ఒకేసారి లక్ష మందిని రిక్రూట్ చేసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్ట్‌లా దీన్ని చేపట్టామని, పూర్తి స్థాయిలో పరిశీలించాక క్రమంగా విస్తరిస్తామని చెప్పారు అనిల్ పూరీ.