Bharat Jodo Yatra: 


రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై స్పందన..


కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా...వారికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సానుకూల వాతావరణం తప్పక ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన...మీడియాతో సమావేశమైన సమయంలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధిష్ఠానం చేతిలో "రిమోట్ కంట్రోల్" అనే కామెంట్స్‌పై ఈ విధంగా స్పందించారు. "కాంగ్రెస్ అధ్యక్ష పదవి
కోసం పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులూ సమర్థులే. ఎవరికి వాళ్లు ఈ పోటీకి అర్హులే. వారిలో ఎవరినైనా సరే రిమోట్ కంట్రోల్ అని పిలవటం అంటే వారిని దారుణంగా అవమానించినట్టే" అని స్పష్టం చేశారు. దాదాపు 22 ఏళ్ల తరవాత కాంగ్రెస్‌కు అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 17న ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. పోటీలో శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. అయితే...ఖర్గే ఎన్నిక లాంఛనమేనని పార్టీ
వర్గాలు చెబుతున్నాయి. దీనిపై...రాహుల్ గాంధీ పూర్తిస్థాయిలో స్పందించటం ఇదే తొలిసారి. "మాది ఫాసిస్ట్ పార్టీ కాదు. మేం చర్చల్ని ఆహ్వానిస్తాం. విభిన్న అభిప్రాయాలకు గౌరవమిస్తాం. ఎన్నికల్లో గెలవాలంటే సమష్టిగా పని చేయాలన్న స్పష్టత మాకుంది" అని రాహుల్ వెల్లడించారు. "అన్ని రాష్ట్రాలు కలిసుంటేనే అది భారత్ అని రాజ్యాంగమే చెబుతోంది. అంటే...భిన్న సంస్కృతులు, రాష్ట్రాలు, సంప్రదా యాలకు సమానమైన ప్రాధాన్యత దక్కాలి. అదే మన దేశం తీరు కూడా. అలా కాకుండా హింసను, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే...అది జాతివ్యతిరేక చర్య అని ఖండించాలి. ఎవరు ద్వేషాన్ని వ్యాప్తి చేసినా...వారిపై మా పోరాటం కొనసాగుతుంది" అని చెప్పారు. 






కర్ణాటకలో జోరుగా యాత్ర..


భాజపాను టార్గెట్ చేస్తూ మరి కొన్ని కామెంట్స్ చేశారు రాహుల్. "భాజపా ఉద్దేశపూర్వకంగానే దేశాన్ని విభజిస్తోంది. ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది. ఇవి దేశానికి ఏ మాత్రం ఉపకరించవు. అందుకే..మేము భారత్ జోడో యాత్ర చేస్తున్నాం. మరో విషయం ఏంటంటే..ఈ యాత్ర నేను మాత్రమే కాదు...నాతో పాటు లక్షలాది మంది చేస్తున్నారు" అని అన్నారు. దసరా కారణంగా మధ్యలో రెండు, మూడు రోజులు విరామమిచ్చి మళ్లీ యాత్ర మొదలు పెట్టారు. కర్ణాటక రాష్ట్రంలో రాహుల్‌తో పాటు సోనియా గాంధీ కూడా పర్యటిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో పాటు భాజపా ఇక్కడ అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్ ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. చాలా రోజుల తరవాత ఆమె ఓ బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా...పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు సోనియా. కర్ణాటకలో మాండ్య నుంచి పాదయాత్ర మొదలు కాగా...రాహుల్‌, సోనియా ఇందులో పాల్గొని పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. బళ్లారిలో ఓ భారీ ర్యాలీ చేపడతారని, అందులోనూ సోనియా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌ జోడో యాత్రలో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు రాహుల్ గాంధీ. పార్టీలో ఉత్తేజం నింపేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే కేరళలో యాత్రను ముగించుకున్న రాహుల్...ఇప్పుడు కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో కాన్నా కాస్త అగ్రెసివ్‌గానే మాట్లాడుతున్నారు.


Also Read: Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కి పశువుల గండం, ఈ సారి ఆవుని ఢీకొట్టిన ట్రైన్ - మళ్లీ డ్యామేజ్