ఆరోగ్యపరంగా ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. చిన్న వయసు పిల్లలని కూడా ప్రభావితం చేస్తూ మరింత ఆందోళనకరంగా మారుతుంది. గతంలో పెద్ద వాళ్ళు మాత్రమే దీని బారిన పడే వాళ్ళు కానీ ఇప్పుడు జన్యుపరమైన కారణాలు, అతిగా జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం సమస్య వచ్చి చిన్న వయసులోనే భారీ కాయులుగా మారుతున్నారు. ఊబకాయం అనేది జీవితాన్ని నాశనం చేసే భయంకరమైన విషయంగా మారి ఆందోళన కలిగిస్తోంది. ఊబకాయ నివారణ పద్ధతులు చాలా ముఖ్యం. పిల్లల్లో ప్రారంభ దశలోనే దీన్ని నివారించడానికి చర్యలు తీసుకోకపోతే అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.


ఊబకాయం అనేది దీర్ఘకాలిక రుగ్మతతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ఇతర హృదయ సంబంధ రుగ్మతల బారిన పడేలా చేస్తుంది. బాల్యంలోనే ఊబకాయం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


పిల్లల్లో స్థూలకాయం నిరోధించడానికి చిట్కాలు


జీవనశైలిలో మార్పులు


అతిగా ఫోన్ చూస్తూ కూర్చోవడం, గంటల తరబడి ల్యాప్ టాప్ ముందు కూర్చుని వీడియో గేమ్స్ ఆడటం వంటి నిశ్చలమైన కార్యకలాపాలు చేసే సమయం తగ్గించాలి. బయటకి పంపించి మైదానాల్లో పిల్లలతో కలిసి ఆడుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి. కుటుంబంతో సంతోషంగా గడపటం, ఆటల ప్రాముఖ్యత, శరీరాక శ్రమ ఆవశ్యకత వారికి అర్థం అయ్యేలాగా చెప్పాలి. ఇంటికే పరిమితం చేయడం వల్ల సోమరిపోతుల్లాగా మారిపోతారు.


ఆరోగ్యకరమైన ఆహారం


పిల్లలు ఇష్టంగా తింటున్నారు కదా అని బేకరీ ఫుడ్స్, పిజ్జా, బర్గర్ వంటి అధిక కెలరీలు ఉండే ఆహారం అలవాటు చేయకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. సీజనల్ వారీగా వచ్చే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పాపులు, చిక్కుళ్ళు ఎక్కువగా తినేలా చేయాలి. బరువు పెరగకుండా ఉండటానికి ప్రాసెస్ చేసిన ఆయిల్, ప్యాక్డ్ , జంక్ ఫుడ్ కి దూరంగా ఉంచడం అన్నింటికంటే ముఖ్యమైన విషయం.


రెగ్యులర్ వ్యాయామం


పెద్దలే కౌ పిల్లలు కూడా క్రమం తప్పకుండా రోజువారీ దినచర్యలో భాగంగా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అదనపు కేలరీలు కరిగించుకోవచ్చు. ఎముకలు, కండరాలు ధృడంగా తయారవుతాయి. నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రేరేపించాలి. ఇది బాల్యంలోనే ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది.


తగినంత నిద్ర


టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం సహ అనేక రకాల ఆరోగ్య పరిస్థితుల నుంచి బయటపడాలంటే తగినంత నిద్ర పోవాలి. శరీరానికి సరిపడా నిద్ర లేకపోతే అది బరువు పెరగడానికి కారణం అవుతుంది.


మానసికంగా ధృడంగా ఉండాలి


పిల్లలు మానసికంగా ధృడంగా ఉండేలా వారిని ప్రోత్సహించాలి. వాళ్ళు ఉల్లాసంగా ఉండేలాగా ఆటలు ఆడించాలి. తమ శారీరక రూపం కారణంగా బయట తిరిగేందుకు ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంటారు. అలాంటి ధోరణి వారిలో రాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పాలి.


బాల్యంలోనే ఉబ్బకాయం వస్తే మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె, మూత్రపిండాల సమస్యలకి దారి తీస్తుంది. ఆడపిల్లల్లో అయితే హార్మోన్ల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తద్వారా యుక్తవయసుకి వచ్చిన తర్వాత పీరియడ్స్, గర్భం దాల్చే వాటిలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక బరువు, ఊబకాయం కారణంగా నిరాశ, ఆందోళన, ఒత్తిడి, ఆత్మ గౌరవం సన్నగిల్లడం వంటి మానసిక రుగ్మతల బారిన పడే ప్రమాదం ఉంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: బ్రౌన్ షుగర్ Vs వైట్ షుగర్? ఆరోగ్యానికి ఏది మంచిది?


Also Read: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!