Vande Bharat Express:
ఆవుని ఢీకొట్టిన వందేభారత్ ట్రైన్..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి ప్రమాద గండాలు తీరిపోవటం లేదు. ఇటీవలే ఓ పశువుల మందను ఢీకొట్టి ముందు భాగమంతా ధ్వంసమైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రైళ్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కాస్త గట్టిగానే ట్రోల్ చేశాయి. అయితే...వెంటనే ఈ ట్రైన్‌ని రిపేర్ చేసి ట్రాక్‌మీదకు తీసుకొచ్చారు. సమస్య తీరిపోయిందిలే అనుకుంటే మరో గండం వెంటాడింది. గాంధీ నగర్ నుంచి ముంబయికి వెళ్తున్న మార్గంలో ఆనంద్ స్టేషన్ వద్ద ఆవును ఢీకొట్టింది వందేభారత్ ట్రైన్. ముందు బంపర్ వంగిపోయింది. ఈ ప్రమాదం కారణంగా 10 నిముషాలు ట్రాక్‌పైనే నిలిచిపోయింది. ఫలితంగా...మరోసారి వార్తల్లోకెక్కింది. సర్వీస్‌లు ప్రారంభమై వారం రోజులు కాక ముందే వరుస ప్రమాదాలతో సతమతమవుతోంది ఇండియన్ రైల్వేస్. అంతకు ముందు పశువుల మందను ఢీకొట్టిన సమయంలోనే కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టలేమని, వీటిని ముందుగా ఊహించే ట్రైన్‌ను డిజైన్ చేశామని చెప్పారు. ఈ ట్రైన్ ముందు భాగాన్ని రీప్లేస్ చేసుకునే సౌలభ్యం ఉందని వెల్లడించారు. మరుసటి రోజే మరోసారి ఆవుని ఢీకొట్టింది.
ఇటీవలే సర్వీస్‌లు ప్రారంభం..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మహారాష్ట్ర, గుజరాత్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఇటీవలే ప్రారంభించారు. వందే భారత్ రైలులో నరేంద్ర మోదీ ప్రయాణించారు. ముంబయి-గాంధీనగర్ రూట్‌లో వందే భారత్ రైలు సేవల్ని అందించనుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
న్యూ దిల్లీ-వారణాసి, న్యూ దిల్లీ-మాతా వైష్ణో దేవి కాట్రా రూట్‌లో వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ముంబయి-గాంధీనగర్ రూట్‌లో వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ముంబయి-గాంధీనగర్ రూట్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారాలు తప్ప వారంలో ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 20901 ముంబయి సెంట్రల్‌లో ఉదయం 6.10 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీనగర్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 20902 గాంధీనగర్‌లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయల్దేరి రాత్రి 8.35 గంటలకు ముంబయి చేరుకుంటుంది.