లోక్‌సభలో వాడకూడని పదాలపై ప్రతిపక్షాల విమర్శలు
పార్లమెంట్‌లో కొత్త నిబంధనల ప్రకారం కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేయటంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ జాబితాలో 'సిగ్గుచేటు, అవినీతిపరుడు' వంటి సాధారణ పదాలనూ చేర్చడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. "న్యూ ఇండియా" అంటూ ట్విటర్‌లో ఓ ఫోటో షేర్ చేశారు. అందులో అన్‌పార్లమెంటరీ వర్డ్‌కి అర్థమేంటే చెప్పేలా ఓ వాక్యం ఉంది. "అన్‌పార్లమెంటరీ వర్డ్స్ అంటే, కేంద్రం తప్పులను ప్రస్తావించేందుకు ఉపయోగించే పదాలు. డిస్కషన్‌లో, డిబేట్‌లో వినియోగించే పదాలన్నీ నిషేధితమే" అని వ్యంగ్యంగా స్పందించారు. రాహుల్‌తో పాటు మరి కొందరు ప్రతిపక్ష నేతలూ ఇదే విధంగా స్పందించారు.
టీఎమ్‌సీ ఎంపీ ఈ గాగ్ ఆర్డర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. "లోక్‌సభ సెక్రటేరియట్ నిషేధించిన పదాలన్నీ సర్వ సాధారణంగా వాడేవే. నిషేధించిన అన్ని పదాలనూ నేను వాడతాను. సస్పెండ్ చేస్తే చేయనివ్వండి" అని
ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది "లోక్‌సభ సెక్రటేరియట్ వాడుక పదాలన్నీ నిషేధించింది. ఇక నుంచి వాహ్ మోదీజీ వాహ్ తప్ప మరే పదాలూ వాడను" అని సెటైర్లు వేశారు.
"ప్రధాని మోదీ వైఖరిని తెలిపే పదాలన్నీ బ్యాన్ చేశారు. తరవాతేంటి విశ్వగురువు గారూ" అంటూ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు జైరామ్ రమేశ్. ప్రియాంక గాంధీ వాద్రా "మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే, దాన్ని కరప్షన్ అనకుండా, మాస్టర్‌స్ట్రోక్ అనాలా? 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ నిలబెట్టుకోలేని ప్రధానిని జుమ్లాజీవి అనకూడదా? కేవలం థాంక్యూ అని మాత్రమే అనాలేమో" అని విమర్శించారు.