Rahul Gandhi:


ట్వీట్ చేసిన రాహుల్..


తనపై అనర్హతా వేటు వేసిన తరవాత తొలిసారి రాహుల్ గాంధీ స్పందించారు. ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. తాను భారత దేశ ప్రజల గొంతుకను వినిపిస్తున్నానని, ఇందుకోసం ఎక్కడి వరకైనా వెళ్లేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. 


"నేను భారత దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను. వాళ్ల గొంతుకను వినిపించేందుకు పోరాడుతున్నాను. దేనికైనా సిద్ధంగానే ఉన్నాను" 
 
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత 






రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బీజేపీపై మండి పడుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా రాహుల్‌కు మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌తో రాజకీయపరమైన విభేదాలున్న పార్టీలు కూడా ఆయనకు అండగా నిలుస్తున్నాయి. ప్రధాని మోదీపై వరుస ట్వీటల్‌తో విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత్ జోడో యాత్రతో రాహుల్ చరిష్మా పెరిగిందని, ఇది చూసే బీజేపీ భయపడిందని అని కాంగ్రెస్ చెబుతోంది. బీజేపీ నియంతృత్వ వైఖరికి ఈ నిర్ణయమే నిదర్శనం అంటూ పలువురు నేతలు ట్వీట్‌లు చేశారు. 


రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దేనికీ భయపడమని, మౌనంగా ఉండమని స్పష్టం చేసింది. చట్ట పరంగా, రాజకీయంగా కచ్చితంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేశ్‌ తేల్చి చెప్పారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. 


"న్యాయపరంగానే కాదు. రాజకీయంగానూ పోరాటం చేస్తాం. ఏ మాత్రం భయపడం. మౌనంగా ఉండం. అదానీ స్కామ్‌పై కమిటీ వేయాలని మేం డిమాండ్ చేస్తుంటే అది పక్కన పెట్టి రాహుల్‌పై అనర్హతా వేటు వేశారు. ప్రజాస్వామ్యమా...ఓ శాంతి"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా దీనిపై స్పందించారు. కచ్చితంగా పోరాడం కొనసాగుతుందని తెలిపారు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ అదానీ అంశం మాట్లాడడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఆయనపై కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నియంతృత్వానికి ఇదో ఉదాహరణ అని మండి పడ్డారు. 


"రాహుల్‌పై అనర్హతా వేటు వేసేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నించింది. నిజాలు మాట్లాడే వాళ్లు ఉండటం ఆ పార్టీకి నచ్చదు. కానీ మేం ఇకపైన కూడా నిజాలే మాట్లాడతాం. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న డిమాండ్‌ను వినిపిస్తూనే ఉంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమై. ఇకపై ఏం చేయాలన్నది అంతర్గతంగా చర్చించుకుంటాం. ఆ మేరకు వ్యూహాలు అమలు చేస్తాం. "


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 


రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ట్విటర్‌లో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కోట్ల రూపాయలు దోచుకుంటున్న వాళ్లకు బీజేపీ అండగా నిలుస్తోందంటూ మండి పడ్డారు. ప్రశ్నించిన వారిపై ఇలా కేసులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. 


"నీరవ్ మోదీ స్కామ్‌ - రూ.14,000 కోట్లు 
లలిత్ మోదీ స్కామ్‌ - రూ.425 కోట్లు
మెహుల్ చోక్సీ స్కామ్ - రూ. 13,500 కోట్లు
ఇలా దేశ సంపదను దోచుకున్న వారిని బీజేపీ ఎందుకు రక్షించాలని చూస్తోంది...? విచారణ అంటేనే ఆ పార్టీ ఎందుకు భయపడుతోంది..? వీటిపై ప్రశ్నించిన వారిపై మాత్రం కేసులు పెడుతోంది. అవినీతి పరులకే బీజేపీ సపోర్ట్ ఇస్తోందా..? " 


- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత 


Also Read: Rahul Disqualification: రాహుల్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? న్యాయ పోరాటం ఫలిస్తుందా?