Rahul Disqualification: 


పైకోర్టులో తేల్చుకోవడమే..


రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. అయితే...ఇప్పుడు రాహుల్ ముందున్న ఆప్షన్స్‌పై చర్చ జరుగుతోంది. కేరళలోని వాయనాడ్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు రాహుల్. ఇప్పుడు ఎంపీగా కొనసాగలేరని తేల్చి చెప్పిన నేపథ్యంలో...అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవకాశముంది. అంతే కాదు. సెంట్రల్ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లా నుంచి రాహుల్ బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన ముందున్న ఒకే ఒక ఆప్షన్ న్యాయ పోరాటం. ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపిన తరవాత ఎంపీలపై అనర్హతా వేటు వేసే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని గట్టిగా వాదిస్తోంది కాంగ్రెస్. అందుకే...లోక్‌సభ సెక్రటరీ జనరల్ తీసుకున్న నిర్ణయం చట్ట పరంగా చెల్లదని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తోంది. ఈ నిర్ణయాన్ని కేవలం లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేస్తే సరిపోతుందని వాదిస్తోంది. రాహుల్ గుజరాత్ హైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు అవకాశముంది. ఈ కోర్టులోనూ అనుకూలంగా తీర్పు రాకపోతే...సుప్రీం కోర్టు వరకూ వెళ్లేందుకు వీలుంటుంది. ఒకవేళ సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు వ్యతిరేకిస్తే అప్పుడు ఆయనకు కొంత ఊరట లభిస్తుంది. ఆ తీర్పుని సస్పెండ్ చేయడమే కాదు. దానిపై స్టే విధిస్తే కానీ రాహుల్‌పై పడిన వేటు రద్దవదు. అలా కాకుండా...కోర్టు ఈ తీర్పుని సమర్థిస్తే మాత్రం రాహుల్‌కు ఇంకే మార్గమూ ఉండదు. కచ్చితంగా చట్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. 8 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండక తప్పదు. ప్రస్తుతం రాహుల్ పై కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. 


ఆ తీర్పు ఆధారంగానే..


రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చడమే కాకుండా రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అప్పటి నుంచి ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దవుతుందన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఉదయం లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు రాహుల్. ఆ తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నారు సెక్రటరీ జనరల్. 


"పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీని సూరత్ దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని వాయనాడ్‌ ఎంపీగా ఉన్న ఆయనపై అనర్హతా వేటు వేస్తున్నాం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజ్యాంగ బద్ధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం" 


- నోటిఫికేషన్‌ 


ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 8 (3) ప్రకారం...ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు లేదా సభ్యురాలు ఏదైనా నేరంలో దోషిగా తేలినా, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడినా ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఈ కోర్టు తీర్పు ఆధారంగా...లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్‌పై చర్యలు తీసుకున్నారు. ఆయనపై అనర్హతా వేటు వేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలూ ఉన్నాయి. అయితే...ఈ తీర్పుపై న్యాయ పోరాటం కొనసాగించేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్. ఒకవేళ పైకోర్టులో ఊరట లభిస్తే రాహుల్ అనర్హతా వేటు నుంచి తప్పించుకోవచ్చు. 


Also Read: Rahul Gandhi Disqualification: భయపడేదే లేదు, బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది - కాంగ్రెస్