Rahul Gandhi On London Speech:
యూకేలో స్పీచ్‌పై రగడ..
యూకేలో రాహుల్ గాంధీ భారత్‌పై, మోదీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పరాయి దేశంలో భారత్ పరువు తీశారంటూ బీజేపీ నేతలు తీవ్రంగా మండి పడ్డారు. పార్లమెంట్‌లోనూ దీనిపై పెద్ద ఎత్తున అలజడి రేగింది. రాహుల్ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇటు కాంగ్రెస్ మాత్రం రాహుల్ మాట్లాడిన దానిలో ఏ తప్పూ లేదని గట్టిగా వాదిస్తోంది. ఇప్పటి వరకూ ఈ వివాదంపై స్పందించని రాహుల్ గాంధీ..ఎట్టకేలకు నోరు విప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని తేల్చి చెప్పారు. తనకు మాట్లాడే అవకాశమిస్తే పార్లమెంట్‌లోనూ సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోందని, ప్రతిపక్ష నేతల్ని మాట్లాడనివ్వడం లేదని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ ఆరోపించారు. అంతే కాదు. కొందరు నేతలపై కేంద్రం నిఘా పెడుతోందనీ అన్నారు. మీడియాను, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని, దర్యాప్తు సంస్థల్ని అనుకూలంగా వాడుకుటున్నారనీ ఆరోపించారు రాహుల్. దీనిపైనే బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా రాహుల్ పార్లమెంట్‌కు వచ్చి అందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మార్చి 13న రెండో విడత బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఈ వాద ప్రతివాదాలతో సభలు వాయిదా పడుతున్నాయి.
"భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అందరికీ తెలుసు. ఓ ప్రతిపక్ష నేతగా ఇదే విషయాన్ని నేను చెబుతున్నాను. ప్రజాస్వామ్యంలో కీలకమైన పార్లమెంట్, పత్రికా స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ..ఇలా అన్నింటి పైనా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అందుకే ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని అంత గట్టిగా వాదిస్తున్నాను"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత