Rahul Gandhi's Bharat Jodo Nyay Yatra: 


రాహుల్ గాంధీ మణిపూర్‌ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను (Bharat Jodo Nyay Yatra Updates) ప్రారంభించారు. మణిపూర్‌లోని తౌబల్‌ జిల్లాలో ఓ ప్రైవేట్ గ్రౌండ్ నుంచి ఈ యాత్ర మొదలు పెట్టారు. అంతకు ముందు రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ఇంఫాల్ చేరుకున్నారు. నిజానికి ఇంకా ముందుగానే యాత్ర మొదలు కావాల్సి ఉన్నా పొగ మంచు కారణంగా విమానం ఆలస్యంగా నడిచింది. ఫలితంగా ఆయన దాదాపు అరగంట పాటు వేచి చూడాల్సి వచ్చింది. మొత్తం 67 రోజుల పాటు కొనసాగనున్న భారత్ న్యాయ్ యాత్ర 100 లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేయనుంది. మొత్తంగా 6,700 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఎగరేసి యాత్రను అధికారికంగా ప్రారంభించారు. 






జనవరి 18 నాటికి ఈ యాత్ర అసోంకు చేరుకోనుంది. మణిపూర్‌లో యాత్ర మొదలు పెట్టి ఆ తరవాత నాగాలాండ్‌కి చేరుకుంటారు. అక్కడి నుంచి అసోంకి యాత్ర చేపడతారు. ఇవాళ రాత్రికి మణిపూర్‌ సరిహద్దులోని ఖుజామా గ్రామంలో బస చేయనున్నారు. ఆ తరవాత అక్కడి నుంచి నాగాలాండ్‌కి వెళ్లి అక్కడ కోహిమాలో భారీ ర్యాలీ చేపడతారు. ఇది ఎన్నికల కోసం చేస్తున్న యాత్ర కాదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశంలో వెనకబడిన వర్గాలు గొంతుని వినిపించేందుకే రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపడుతున్నట్టు తేల్చి చెప్పింది. అందరికీ న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించింది.