Rahul On Adani : పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీతో ప్రధాని మోదీకి ఉన్న సంబంధం ఏమిటని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రశ్నించారు.  రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధన్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. 20౧4 నుంచి 2022 వ‌ర‌కు ఆయ‌న ఆస్తులు 8 బిలియ‌న్ల డాల‌ర్ల నుంచి 140 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు ఎలా వెళ్లాయ‌ని రాహుల్ గాందీ ప్రశ్నించారు.  భార‌త్ జోడో యాత్ర స‌మ‌యంలో వివిధ రాష్ట్రాల ప్ర‌జ‌లు ఈ ప్ర‌శ్న‌  వేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.


అన్ని చోట్లా అదానీ గురించే చర్చ జరుగుతోందన్న రాహుల్ 
 
త‌మిళ‌నాడు, కేర‌ళ నుంచి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌ర‌కు అంత‌టా ఒక్క‌టే పేరు వినిపిస్తోంద‌ని, అంత‌టా అదానీ పేరే వినిపిస్తోంద‌ని రాహుల్ అన్నారు.  క‌శ్మీర్‌లోని యాపిల్స్‌  నుంచి.. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్డుల గురించి కూడా అదానీ పేరు వినిపిస్తోంద‌ని అన్నారు.  సభలో మోడీ, అదానీ కలిసి ఉన్న ఫొటోను రాహుల్ ప్రదర్శించగా బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ రాహుల్ ను వారించారు. 


మోదీ ఢిల్లీ పీఠం ఎక్కడం వెనుక అదానీ హస్తం


2014లో మోదీ ఢిల్లీ పీఠం ఎక్కడం వెనుక అదానీ ఉన్నారని ఆరోపించారు. ఎయిర్ పోర్టులకు సంబంధించి ఎలాంటి అనుభవం లేని కంపెనీలకు వాటి డెవలప్ మెంట్ పనులు అప్పగించొద్దన్న రూల్ ను అదానీ కోసం కేంద్రం మార్చేసిందని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుతం అదానీ చేతిలో ఆరు ఎయిర్ పోర్టులు ఉన్నాయని, చివరకు అత్యంత లాభదాయకమైన ముంబై ఎయిర్ పోర్టును సైతం సీబీఐ, ఈడీలను ఉపయోగించి జీవీకే నుంచి లాక్కొని అదానీకి అప్పజెప్పారని విమర్శించారు. డ్రోన్ల తయారీలో అనుభవం లేకపోయినా హెచ్ఏఎల్ ను కాదని అదానీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టడం వెనుక కారణాలతో పాటు ఇప్పటి వరకు ఆయనకు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 


జీవీకే నుంచి ముంబై ఎయిర్ పోర్టు బలవంతంగా లాక్కున్నారు !


జీవీకే నుంచి ముంబై ఎయిర్ పోర్టును బలవంతంగా లాక్కున్నారని  రాహుల్ గాంధీ ఆరోపించారు. సీబీఐ, ఈడీతో అనేక వ్యాపార సంస్థల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు.  ప్రధాని, అదానీ మధ్య బంధం ఈ నాటిదికాదన్న రాహుల్... మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న నాటి వారు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని అన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలుంటే చూపించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ కు సూచించారు.


నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రస్తావన ఏది ? 


రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంలో నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణం లాంటి అంశాల‌ను ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. అగ్నివీర్ ప‌థ‌కం ఆర్మీ ఆలోచ‌న నుంచి రాలేద‌ని, అది ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవ‌ల్ ఆలోచ‌న నుంచి వ‌చ్చిట్లు రాహుల్ విమ‌ర్శించారు. అగ్నివీర్ ప‌థ‌కాన్ని బ‌లవంతంగా ఆర్మీపై రుద్దిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ఆయుధ శిక్ష‌ణ ఇచ్చి, వాళ్ల‌ను తిరిగి స‌మాజంలోకి పంప‌డం వ‌ల్ల హింస పెరుగుతుంద‌ని రిటైర్డ్ ఆఫీస‌ర్లు ఆరోపిస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.