Rahul Gandhi Demands Resignation Education Minister: ప్రధానమంత్రిమోదీ నివాసం ముందు రాహుల్ గాందీ సహా కాంగ్రెస్ నేతలు చేపట్టిన ధర్నా అరెస్టులతో ముగిసింది. మూడున్నర గంటల పాటు వీరంతా ధర్నా చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై పోలీసుల లాఠీఛార్జ్, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం జాతీయ స్థాయిలో తీవ్రరూపం దాల్చింది. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేతలు, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రాల నేతృత్వంలో సీనియర్ నాయకులు లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వైపు హఠాత్తుగా కవాతు చేపట్టారు. ప్రధాని నివాసానికి చేరుకోవడానికి ముందే రక్షణ దళాలు భారీ బారికేడ్లతో అడ్డుకోవడంతో, రాహుల్ గాంధీతో పాటు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు రోడ్డుపైనే బైఠాయించి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం సాగుతున్న ఈ పోరాటంలో ప్రధాని మోదీ సమాధానం చెప్ప తీరాల్సిందేనని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపైనే నినాదాలతో హోరెత్తించారు.
ధర్నా ప్రారంభమైన తరవాత రాహుల్ తో ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలసి నేరుగా ధర్నా స్థలికి చేరుకుని రాహుల్ గాంధీతో ముఖాముఖి చర్చలు జరిపారు. ప్రజా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ధర్నాను విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే, రాహుల్ గాంధీ కేంద్రం ముందుకు 5 స్పష్టమైన షరతులు ఉంచారు
నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలపై తక్షణమే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి. బాధిత విద్యార్థులందరికీ నష్టపరిహారంతో పాటు ఉచితంగా, పారదర్శకంగా మళ్లీ నీట్ పరీక్షలు నిర్వహించాలి. పార్లమెంట్‌లో ప్రధాని సమక్షంలో ప్రత్యేక విభాగం కింద నీట్ కుంభకోణంపై పూర్తిస్థాయి చర్చ జరగాలి. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా కఠినమైన జాతీయ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఉంచిన ఈ డిమాండ్లపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, పార్లమెంట్‌లో నీట్ అంశంపై విస్తృత చర్చకు ప్రభుత్వం సంపూర్ణ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. అయితే, విద్యాశాఖ మంత్రి , హోంమంత్రి రాజీనామాల విషయంలో మాత్రం ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. మొదట రాహుల్ గాంధీ కేవలం పార్లమెంట్ చర్చ మాత్రమే కోరి, ఆ తర్వాత మంత్రుల రాజీనామా డిమాండ్‌ను తెరపైకి తెచ్చి నిరసన విరమించకుండా మాట మార్చారని మంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు. ప్రభుత్వం రాతపూర్వకంగా ఖచ్చితమైన హామీలు ఇస్తే తప్ప వెనక్కి తగ్గేది లేదని రాహుల్ గాంధీ తెగేసి చెప్పడంతో ఈ చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి.
చర్చలు విఫలమవ్వడంతో రాహుల్ గాంధీ , కాంగ్రెస్ అగ్రనాయకత్వం తమ ధర్నాను సుదీర్ఘంగా కొనసాగించారు. మధ్యాహ్నం నుంచి దాదాపు మూడున్నర గంటల పాటు లోక్ కల్యాణ్ మార్గ్ పరిసర ప్రాంతాలు కాంగ్రెస్ నినాదాలతో దద్దరిల్లాయి. రోడ్డుపైనే కూర్చున్న రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా దేశభక్తులైన పౌరులంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై జరిగిన దాడి వంటిదే.. ఈసారి మోదీ ప్రభుత్వం తప్పించుకోలేదు అని తీవ్రంగా హెచ్చరించారు. నిరసన సమయం పెరుగుతుండటం, వర్షాకాల పార్లమెంట్ సమావేశాల వేళ భద్రతా ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో ఢిల్లీ పోలీసులు యాక్షన్ ప్లాన్ అమల్లోకి తెచ్చారు.
చివరకు, సుమారు మూడున్నర గంటల ఉద్రిక్త సమయం తర్వాత, భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. రోడ్డుపై ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడా, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కన్హయ్య కుమార్ సహా పదుల సంఖ్యలో ఎంపీలు , సీనియర్ నేతలను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రత్యేక పోలీస్ వ్యాన్లలో సమీప స్టేషన్లకు తరలించారు. అరెస్టవుతున్న సమయంలోనూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ అరెస్టుతో ప్రధాని నివాస ముట్టడి తాత్కాలికంగా ముగిసినప్పటికీ, ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో పార్లమెంట్‌తో పాటు దేశవ్యాప్తంగా మరింత ఉధృతం కానుందని స్పష్టమవుతోంది.
