AP Politics Jethwani Social Media Allegations: నటి కాదంబరి జెత్వానీ వ్యవహారం మళ్లీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గతంలో బాధితురాలిగా ప్రచారంలోకి వచ్చిన మహిళను, ఇప్పుడు నిందితురాలిగా చిత్రీకరిస్తున్నారంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెడుతున్నారు. అయితే, జరుగుతున్న పరిణామాలను పక్కదారి పట్టించేందుకు, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఈ తరహా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వం, టీడీపీ వివరాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ కాదంబరి జెత్వానీ ఎపిసోడ్‌ను ఒకే సమస్యగా కాకుండా, చట్టబద్ధంగా రెండు వేర్వేరు కేసులు అని టీడీపీ వివరణ విడుదల చేసింది.
మొదటి కేసు జెత్వానీపై నమోదైన కేసు - రెండో కేసు జెత్వానీ ఫిర్యాదుతో నమోదైంది!
ఈ రెంటిలో మొదటి కేసు—జెత్వానీకి, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు మధ్య ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు , ఆమె బ్లాక్‌మెయిల్ చేసిందనే ఆరోపణలకు సంబంధించింది. ఈ వ్యవహారంలో జెత్వానీ నిందితురాలిగా ఉన్నారు. ఇక రెండో కేసు నకిలీ పత్రాలతో విద్యాసాగర్ అనుచరులతో జెత్వానీ భూ ఒప్పందం చేసుకున్నట్లు నాడు సీఎంఓ ఆదేశాలతో ఒక అసత్య కథనాన్ని అల్లి, ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా నిర్బంధించి వేధించడం. ఈ రెండో కేసులోనే ఎన్టీఆర్ జిల్లాలో కేసు నమోదైంది. నాటి డీజీపీ ర్యాంక్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, ఐజీ కాంతిరాణా తాతా, ఎస్పీ విశాల్ గున్ని వంటి ఐపీఎస్ అధికారులపై చట్టపరమైన దర్యాప్తు జరిగింది. ఈ రెండో కేసే దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ జవాబుదారీతనంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఓ కేసులో బాధితురాలు..మరో కేసులో నిందితురాలు
ఈ రెండు కేసుల్లోనూ ప్రాథమిక తేడా ఏంటంటే.. మొదటి కేసులో జెత్వానీ నిందితురాలు కాగా, రెండో కేసులో ఆమె స్పష్టమైన బాధితురాలు. మొదటి కేసులో ఉన్న తెరవెనుక వ్యవహారాలను, రాజకీయ స్వార్థాన్ని దాచిపెట్టడానికి గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. నాటి ఉన్నతాధికారులు స్వామిభక్తి ప్రదర్శిస్తూ సీఎంఓ ఒత్తిళ్లకు తలొగ్గి కథ అల్లడమే కాకుండా, ఆమెను గెస్ట్ హౌస్‌లు, హోటళ్లలో అక్రమంగా నిర్బంధించి తీవ్ర వేధింపులకు గురిచేశారు. పోలీసుల ఆనాటి అత్యుత్సాహం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను ఉల్లంఘించడం వల్లే మొదటి కేసులో నిందితురాలిగా ఉన్న జెత్వానీ, రెండో కేసులో తీవ్రంగా నష్టపోయిన బాధితురాలిగా మారాల్సి వచ్చింది.
రెండు వేర్వేరు కేసులుగా విచారణ
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ రెండు కేసులను వేర్వేరుగానే పరిగణిస్తూ చట్టప్రకారం, రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తోంది. జెత్వానీ తప్పు ఉందన్న మొదటి కేసులో పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. అదే సమయంలో, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆమెను అక్రమంగా నిర్బంధించిన ఐపీఎస్ అధికారుల పాత్ర నిర్ధారణ కావడంతో వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఒక కేసులో నిందితురాలిగా ఉన్నప్పటికీ, మరొక కేసులో ఆమె హక్కులకు భంగం వాటిల్లినందున ప్రభుత్వం రెండు అంశాలనూ న్యాయబద్ధంగానే డీల్ చేస్తోంది.
జెత్వానీ నిందితురాలిగా ఉన్న మొదటి కేసులోని ఛార్జ్‌షీట్ అంశాలను మాత్రమే ఆధారంగా చేసుకుని, రెండవ కేసుతో దాన్ని కలగలిపేసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో కుట్రపూరిత కథనాలు అల్లుతున్నారు. ప్రొసీజర్ ప్రకారం ఛార్జ్‌షీట్ వేయడం వేరు, ఆ పేరుతో గతంలో జరిగిన అక్రమ నిర్బంధాలను సమర్థించుకోవడం వేరు అనే నిజాన్ని గ్రహించాలని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. రెండు కేసులను నిష్పాక్షికంగా విచారిస్తూ, తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమానులే అనే దిశగా ప్రస్తుత యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.
