Rahul Gandhi Defamation Case:



నెక్స్ట్ ఏంటి..? 


పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్విటర్‌లో యుద్ధం నడుస్తోంది. జైలు శిక్ష విధించిన వెంటనే  బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే..తరవాత రాహుల్ పరిస్థితేంటి అన్నదే ఆసక్తికరంగా మారింది. 30 రోజుల బెయిల్ మాత్రమే మంజూరు చేసింది సూరత్ కోర్టు. ఈ కారణంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యే ప్రమాదముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయనపై అనర్హతా వేటు పడే అవకాశముందని అంటున్నారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 8 (3) ప్రకారం...ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు లేదా సభ్యురాలు ఏదైనా నేరంలో దోషిగా తేలినా, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడినా ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఈ కోర్టు తీర్పు ఆధారంగా...లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్‌పై చర్యలు తీసుకునే అవకాశమూ ఉంది. ఆయనపై అనర్హతా వేటు వేసే ఆస్కారముంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలూ ఉన్నాయి. అయితే...ఈ తీర్పుపై న్యాయ పోరాటం కొనసాగించేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్. ఒకవేళ పైకోర్టులో ఊరట లభిస్తే రాహుల్ అనర్హతా వేటు నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ సూరత్ కోర్టు తీర్పుని ఏ హైకోర్టు కూడా కొట్టివేయలేదంటే మరో 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నీ కోల్పోతారు రాహుల్. కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో భయపడేదే లేదు అని తేల్చి చెబుతోంది. ట్విటర్‌ డీపీని కూడా మార్చింది. రాహుల్ ఫోటోపై "ఢరో మత్" అని కోట్ చేసి అదే డీపీని పెట్టుకుంది.