Bharat Jodo Nyay Yatra: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి నిర్ణయాలతో చిన్న వ్యాపారాలను పూర్తిగా నాశనం చేశారని మండి పడ్డారు. మోదీ విధానాల వల్ల దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్థాన్‌ కన్నా ఈ విషయంలో భారత్ వెనకబడిపోయిందని తేల్చిచెప్పారు. 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు భారత్‌లో కనిపిస్తోందని అన్నారు. ఇదంతా కేవలం మోదీ తీసుకొచ్చిన విధానాల వల్లే అని విమర్శించారు. 


"40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోయింది. పాకిస్థాన్‌లో కన్నా రెట్టింపు నిరుద్యోగం భారత్‌లో ఉంది. బంగ్లాదేశ్, భూటాన్‌లో కన్నా మన దగ్గరే ఎక్కువ మంది నిరుద్యోగులున్నారు. నరేంద్ర మోదీ వచ్చిన తరవాత చిన్న వ్యాపారాలన్నీ దెబ్బ తిన్నాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ నిర్ణయాలు అంతా నాశనం చేశాయి"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత






ఇదే సమయంలో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించీ ప్రస్తావించారు. దేశం నలు మూలల నుంచి అంబానీ వేడుకలకు ప్రముఖులు వెళ్తున్నారని, ఇక్కడ ఇంత మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే వాళ్లంతా అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంటూ మండి పడ్డారు. ఇప్పటికే భారత రైల్వే వ్యవస్థ గురించీ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. కేవలం ధనికుల కోసమే కేంద్రం కొత్త రైల్వే విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. టికెట్‌ ధరలు పెరుగుతున్నాయని అని మండి పడ్డారు. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలూ పెరిగిపోయాయని అన్నారు. పేదలకు అందుబాటులో లేకుండా కొత్త రైళ్లని తీసుకొస్తున్నారని మోదీపై అసహనం వ్యక్తం చేశారు. సౌకర్యాలు ఆశ చూపించి విపరీతంగా ధరలు పెంచేస్తున్నారని అన్నారు. ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచుతూ జనరల్ బోగీలకు ప్రజల్ని దూరం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 


"ఏసీ కోచ్‌ల సంఖ్యని పెంచడం కోసం జనరల్ బోగీల సంఖ్యని తగ్గించేస్తున్నారు. ఎంతో మంది రైతులు,విద్యార్థులు, సామాన్యులు ఈ కోచ్‌లలో ప్రయాణిస్తారు. జనరల్ బోగీల కన్నా ఏసీ కోచ్‌ల తయారీ మూడు రెట్లు పెరిగింది. ఈ లొసుగులన్నింటినీ దాచేయడానికే రైల్వేకి బడ్జెట్‌ని ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 


Also Read: BJP Candidate List 2024: బీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల, లిస్ట్‌లో ఎవరున్నారంటే?