Rahul Gandhi on Agniveer Scheme: అగ్నివీర్ స్కీమ్‌పై (Agniveer Row) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. డ్యూటీలో ఉన్న ఓ సైనికుడు అమరుడు కాగా ఇప్పటి వరకూ అతడి కుటుంబానికి ఎలాంటి పరిహారం అందలేదని మండి పడ్డారు. మృతుడి తండ్రి మాట్లాడిన ఓ వీడియోని రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ కుటుంబానికి ప్రైవేట్ బ్యాంక్ నుంచి రూ.48 లక్షల ఇన్సూరెన్స్ వచ్చిందని, ఇది ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ నుంచి వచ్చిందని తండ్రి వివరించాడు. అయితే...ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం మాత్రం అందలేదని చెప్పాడు ఆ సైనికుడు తండ్రి. జీతమూ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశాడు. పరిహారం, బీమా రెండూ వేరు వేరని చెబుతూనే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇంత వరకూ అతనికి రావాల్సిన డబ్బు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 


"అగ్నివీర్ అజయ్ కుమార్ అమరుడయ్యాడు. కానీ అతని కుటుంబానికి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. ఇన్సూరెన్స్‌కి, పరిహారానికి చాలా తేడా ఉంది. ఇప్పటి వరకూ ఈ కుటుంబానికి అందింది కేవలం బీమా మాత్రమే. అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చినవే. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ






పరిహారం ఇవ్వలేదని అసహనం..


దేశ సేవలో అమరులైన ప్రతి ఒక్క సైనికుడికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. కానీ మోదీ సర్కార్ అగ్నివీర్‌లపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని, కచ్చితంగా దీని గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. అమరుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకూ తమకు ఆ సాయం అందలేదని బాధితుడి తండ్రి చెప్పారు. అగ్నివీర్‌ స్కీమ్‌పై చాలా రోజులుగా టార్గెట్‌ చేశారు రాహుల్ గాంధీ. యువతను మోదీ సర్కార్ మోసం చేస్తోందని మండి పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలనూ అగ్నివీర్ రద్దుని చేర్చింది. మొదటి నుంచి ఈ రిక్రూట్‌మెంట్‌ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఉద్యోగ భరోసా లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 


Also Read: Viral Video: 2020లో మళ్లీ ట్రంప్‌ని ఓడిస్తా, బైడెన్ వింత వ్యాఖ్యలు - టైమ్ ట్రావెలింగ్ చేస్తారేమో అంటూ నెటిజన్ల సెటైర్లు