Rahul Gandhi on BJP RSS: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) రాజస్థాన్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ఆర్‌ఎస్‌ఎస్ (RSS), భాజపా (BJP)పై విమర్శలు చేశారు. రాముడు, సీతా దేవిని కలిపి స్తుతించే "హే రామ్", "జై సీతారాం" నినాదాలను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ పట్టించుకోలేదని రాహుల్ అన్నారు. ఝలావర్ జిల్లా నహర్డిలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులు.. రాముడి ఆశయాలకు అనుగుణంగా జీవించడం నేర్చుకోండి. జాగ్రత్తగా వినండి.. 'హే రామ్', 'జై సీతారాం' అని చెప్పాలి. ఈ నినాదం ఒకప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగింది. సీత లేకుండా రాముడు ఉండగలడా? అసలు ఈ ప్రశ్నే తలెత్తదు. సీత లేకుండా రాముడు ఉండడు. రాముడు లేకుండా సీత ఉండదు. అలాంటప్పుడు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు సీతా మాతను తమ నినాదాల నుంచి ఎందుకు తొలగించారు. 'జై సీతారాం' అని ఎందుకు అనరు? మీరు 'జై శ్రీరామ్' అనాలనుకుంటే ఫర్వాలేదు.. అలా చేయండి. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్లు మాత్రం 'జై సీతారాం' అనాల్సిందే. సీతను మీరు అవమానించలేరు. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
హే రామ్!
గాంధీజీ చెప్పే మరో నినాదం ఉంది. ఇది బహుశా అత్యంత అందమైన నినాదం... హే రామ్! దీనిలో లోతైన అర్థం ఉంది. నేను మీకు 'హే రామ్' అనే పదానికి అర్థం చెప్పాలనుకుంటున్నాను. ఇవి మహాత్మా గాంధీ చెప్పిన పదాలు. ఆయనను తుపాకీతో కాల్చిన తర్వాత హే రామ్, హే రామ్, హే రామ్.. అంటూ నేలకొరిగారు. ఆ నినాదంలోని లోతును, గాంధీజీ ఆలోచనను మీకు చెప్పాలనుకుంటున్నాను. హే రామ్ అంటే రాముడు. రాముడు అందరినీ గౌరవిస్తాడు. ఎవరినీ ద్వేషించడు. రాముడికి ఒక ఆలోచన ఉంది, అతని హృదయంలో ఒక భావన ఉంది. అతనికి ఒక జీవన విధానం ఉంది. రాముడు అందరినీ గౌరవించేవాడు. అతను ఎవరినీ ద్వేషించలేదు. అందరినీ ప్రేమిస్తూ దగ్గరికి తీసుకున్నాడు. ఆ అనుభూతిని 'హే రామ్' అంటాం. హే రామ్ అని చెప్పినప్పుడు, రాముడి ఆదర్శాల ప్రకారం మన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటాం. హే రామ్ అంటే అర్థం ఇది. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత