ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా నెల్లూరు జిల్లాకు వచ్చారు, ఇప్పుడు మరోసారి ఆయన జిల్లాలో పర్యటించబోతున్నారు. అయితే ఈసారి మాత్రం భారీ భద్రతా ఏర్పాట్లపై అధికారులు దృష్టిపెట్టారు. గతంలోకి, ఇప్పటికి తేడా ఏంటి..? అసలిప్పుడు ఎందుకీ హడావిడి, జిల్లాలో సీఎం పర్యటనపై అధికారులు ఎందుకంత ఫోకస్ పెట్టారు.. ?
ముఖ్యమంత్రి జగన్ ఈనెల 7న నెల్లూరు నగరానికి వస్తున్నారు. నెల్లూరు కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్ లో జరిగే సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి జగన్ హాజరవుతారు. కేవలం 15నిమిషాలు మాత్రమే ఆయన ఆ వివాహ వేడుక వద్ద ఉంటారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, అధికారుల పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
పర్యటన ఇలా...
అదేరోజు సీఎం జగన్ విజయవాడలో జరిగే బీసీ గర్జన కార్యక్రమానికి కూడా హాజరు కావాల్సి ఉంది. అందుకే ఈ రెండు కార్యక్రమాల మధ్య సమన్వయం కోసం అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. బీసీ గర్జన తర్వాత తిరిగి తన నివాసానికి చేరుకున్న జగన్, అనంతరం మళ్లీ గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వస్తారు. అక్కడి నుంచి విమానంలో రేణిగుంట చేరుకుంటారు. రేణిగుంట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నెల్లూరుకి వస్తారు. నెల్లూరు కనుపర్తిపాడులోని జడ్పీ హైస్కూల్ లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ హెలికాప్టర్ దిగి రోడ్డు మార్గం ద్వారా కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్ కి చేరుకుంటారు. వివాహ మహోత్సవంలో పాల్గొంటారు.
జిల్లా నాయకులతో సమావేశం..
హెలిప్యాడ్ వద్ద కాసేపు జిల్లా నాయకులతో సీఎం జగన్ భేటీ అవుతారని సమాచారం. అయితే ఇది కేవలం పలకరింపులు, పూలదండలు, శాలువాలకే పరిమితమా లేక జిల్లా రాజకీయాలపై చర్చ జరుగుతుందా అనేది తేలాల్సి ఉంది. హెలిప్యాడ్ వద్ద 20నిమిషాలసేపు ఆయన స్థానిక నాయకులను కలుస్తారు. ఆ తర్వాత వివాహ వేదిక వద్దకు వెళ్తారు. అక్కడ కేవలం 15నిమిషాలు మాత్రమే ఉంటారు.
జిల్లాలో పరిస్థితులేంటి..?
ఇటీవల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం నెల్లూరు జిల్లాకు వచ్చారు సీఎం జగన్. నెలరోజుల గ్యాప్ లో మళ్లీ ఇప్పుడు వివాహ వేడుకలో పాల్గొనేందుకు జిల్లాకు వస్తున్నారు జగన్. ఇది ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి, ఎక్కడా నిరసనలు, ఆందోళనలు ఊహించలేం. కానీ ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కి ఉన్నాయి. ఈ దశలో జనసేన, టీడీపీ నుంచి నిరసనలు ఎదురవుతాయేమోననే అనుమానం కూడా పోలీసుల్లో ఉంది. అందుకే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు..
కనుపర్తిపాడు జడ్పీ హైస్కూలులో హెలిప్యాడ్ వద్ద చేపట్టాల్సిన భద్రత, కాన్వాయ్ రాకపోకలు, పార్కింగ్, వీఐపీల విజిట్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విజయరావు పరిశీలించారు. కలెక్టర్ చక్రధర్ బాబు ఇతర అధికారులు వీపీఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె వివాహం కావడంతో.. వివాహంలో కూడా వైసీపీ నేతల హడావిడే ఎక్కువగా ఉంటుంది. వివాహం అయిపోయిన తర్వాత నేరుగా సీఎం జగన్ తిరిగి రేణిగుంటకు హెలికాప్టర్లో వెళ్తారు. అక్కడినుంచి విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు.