ABP  WhatsApp

Rahul Gandhi: దేశంపై ప్రయోగించిన ఈ ఆయుధంపై చర్చ జరగాల్సిందే: రాహుల్ గాంధీ 

ABP Desam Updated at: 28 Jul 2021 06:03 PM (IST)

దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్‌ వ్యవహారంపై రాహుల్‌ గాంధీ నేతృత్వంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రంపై ఘాటు విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi

NEXT PREV

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించే పెగాసస్‌ స్పైవేర్‌ను మన ఫోన్లలోకి పంపించిన కేంద్రం.. ఇప్పుడు ఆ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై నేడు రాహుల్‌ నేతృత్వంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంపై ఘాటు విమర్శలు గుప్పించారు. హ్యాకింగ్‌ వ్యవహారంపై కేంద్రం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు. 



పెగాసస్‌ స్పైవేర్‌ను ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాడాలి. కానీ నరేంద్ర మోదీజీ ఈ ఆయుధాన్ని మన ఫోన్లలోకి పంపించారు. నా ఫోన్‌తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అనేక మంది ప్రముఖ రాజకీయ నేతలు, మీడియా వ్యక్తుల ఫోన్లను హ్యాక్‌ చేశారు. మేం ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే.. పెగాసస్‌ను కొనుగోలు చేశారా?.. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉపయోగించారా? పెగాసస్‌.. నా వ్యక్తిగత అంశం కాదు.. దేశ భద్రతకు సంబంధించిన విషయం. దీనిపై కేంద్రం జవాబు చెప్పి తీరాలి. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వడం లేదని కేంద్రం చెబుతోంది. కానీ మేం పార్లమెంట్‌ను అడ్డుకోవడం లేదు. కేవలం మా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన ఈ ఆయుధం(పెగాసస్‌)పై  చర్చ జరగాల్సిందే             - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత 


అనంతరం శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. దేశ భద్రత, సాగు చట్టాలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. "పార్లమెంట్‌ను నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ పెగాసస్‌పై చర్చ చేపట్టకుండా కేంద్రం తప్పుకుంటోంది" విమర్శించారు. 


మమతా ఆగ్రహం..


ఈ పెగాసస్ వ్యవహారంపై మమతా బెనర్జీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోన్ హ్యాక్ అయిందని, ఎమర్జెన్సీని మించిపోయిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అందువల్ల గత కొంతకాలం నుంచి ఎవరికీ తాను ఫోన్ కాల్స్ చేయలేకపోతున్నానని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కొందరు ప్రముఖులు, ప్రతిపక్ష పార్టీల సీఎంలు, కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


పెగాసస్ స్పై వేర్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తమ వ్యక్తిగత సమాచారం లీక్ చేస్తున్నారని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. మమతా బెనర్జీ సైతం పెగాసస్ వివాదంపై ఘాటుగా స్పందించారు. పెగాసస్ అంటే ఏమిటి, అదోక వైరస్. మన భద్రత, వ్యక్తిగత విషయాలు ప్రమాదంలో పడ్డాయని బంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని బుధవారం నాడు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ప్రతిపక్ష పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విమర్శలు చేశారు. కానీ తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం తన వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొనడం గమనార్హం.

Published at: 28 Jul 2021 06:03 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.