Rachakonda Police Arrested Drugs Gang: తెలంగాణలో (Telangana) డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు (Rachakonda Police) పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా రాజస్థాన్ (Rajastahan) నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ (Hyderabad) లో అమ్మాలని చూస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు (Rachakonda Commissioner SudheerBabu) వెల్లడించారు. ఇద్దరు నిందితులు శశిపాల్ బిష్ణోయ్, మదన్ లాల్ బిష్ణోయ్ లను అరెస్ట్ చేశామని, ఓపియం డ్రగ్ 3.4 కేజీలు, 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అలాగే, రూ.2.8 లక్షల నగదు సీజ్ చేశామని చెప్పారు. శశిపాల్ గతంలోనూ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని, బస్ ద్వారా డ్రగ్స్ హైదరాబాద్ కు తెస్తున్నారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని, మత్తు పదార్థాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కొత్త సంవత్సర వేడుకల క్రమంలో పబ్స్ పై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.


ఎస్సార్ నగర్ లోనూ


ఎస్సార్ నగర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లోనూ నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొందరు యువకులు బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ తీసుకొచ్చి పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. వీరంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని, వీరిలో 12 మంది ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉన్నట్లు చెప్పారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్ డే కోసం సంపత్ అనే వ్యక్తి  గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాడని, 30 మంది కోసం ప్రేమ్ చంద్ డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. 


నిరంతర నిఘా


అటు, డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రాష్ట్రంలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఎక్సైజ్, నార్కోటిక్ అధికారులతో తాజాగా సమావేశం నిర్వహించారు. నార్కోటిక్ టీంను అక్టోపస్ గ్రేహౌండ్స్ లా బలోపేతం చేస్తామని, డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించి తెలంగాణ పోలీస్ దేశానికే రోల్ మోడల్ గా నిలవాలని ఆయన చెప్పారు. 


పబ్స్, బార్లపై ప్రత్యేక నిఘా


డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా పోలీసులు పబ్స్, బార్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇటీవల, హైదరాబాద్ లోని పబ్బుల్లో వెస్ట్ జోన్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తొలిసారిగా తనిఖీల్లో స్నిపర్ డాగ్స్ వినియోగించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎక్కడా మత్తు పదార్థాల వినియోగం లేకుండా పటిష్ట నిఘా ఉంచుతున్నారు. పబ్స్, బార్లలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని యజమానులను హెచ్చరిస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్న పబ్స్ పై నిఘా తీవ్రం చేశారు. కేవలం పబ్స్, బార్లలోనే కాకుండా సిటీకి దూరంగా ఉండే ఫాం హౌస్ లపైనా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. 


Also Read: Nizamabad Family Killed: స్నేహితుడు కాదు, నర హంతకుడు! ఒకే కుటుంబంలో ఆరుగురి దారుణహత్య