Nizamabad Crime News 6 People Killed: డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లాలో ఓ కుటుంబంలో ఒక్కొక్కరుగా ఆరుగురు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. స్నేహితుడు అని నమ్మితే ఏకంగా ఆ ఫ్రెండ్ కుటుంబాన్నే అంతం చేశాడు. పైగా పగ, ప్రతీకారం లాంటివి కూడా లేవు. కానీ వారం రోజులపాటు స్నేహితుడి కుటుంబాన్ని ఓ నర హంతకుడు పొట్టన పెట్టుకున్నాడని తెలిసి జిల్లా వాసులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వరుస డెడ్ బాడీలు దొరకడంతో పోలీసులకు సైతం ఏం జరుగుతుందో మొదట అర్థం కాలేదు. స్నేహితుడు కుటుంబాన్ని ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడని, అది కూడా ఆస్తి కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసి పోలీసులే షాకయ్యారు. 


నిందితుడు మొదటగా తన స్నేహితుడ్ని హత్య చేశాడు. ఆపై ఆయన భార్యను కడతేర్చి.. కొంచెం గ్యాప్ లో వారి పిల్లల్ని హత్య చేశాడు. స్నేహితుడి ఇద్దరు చెల్లెళ్లను సైతం దారుణంగా చంపి శవాలను తనకు వీలున్న చోట పడేస్తూ వెళ్లిపోయాడు. మొదట మూడు హత్యలను ప్రధాన నిందితుడు ఒక్కడే చేయగా, చివరగా చంపిన ముగ్గుర్ని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 9 నుంచి వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర్ని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ వరుస హత్యలతో డిచ్‌పల్లి మండలం మాట్లూరులో విషాదఛాయలు కనిపిస్తున్నాయి.


నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం మాక్లూర్‌ కు చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి కుటుంబం మొత్తం హత్యకు గురైంది. మాక్లూర్ కు చెందిన ప్రసాద్ కుటుంబం ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్ కు మాక్లుర్ లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. లోన్ రాకపోవడంతో ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ పై ప్రసాద్ ఒత్తిడి చేశాడు. ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్.. మొత్తం ఆరుగుర్ని హత్య చేశాడు. మొదట ప్రసాద్ ను అతడి ఫ్రెండ్ ప్రశాంత్ హత్య చేశాడు. డిచ్‌పల్లి వద్ద హైవే పక్కన ఎవరికి అనుమానం రాకుండా ప్రసాద్ మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. ప్రసాద్‌ ను పోలీసులు తీసుకెళ్లారని చెప్పి నమ్మించి అతడి భార్యను తీసుకెళ్లి బాసర వద్ద గోదావరిలో పడేశాడు ప్రశాంత్. ప్రసాద్, రమణి దంపతులకు సంతానం ఇద్దరు కవల పిల్లలు. 


చిన్నారులు ఇద్దర్ని ఏవో మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి.. కవల పిల్లల్ని హత్యచేసి పోచంపాడ్‌ సోన్‌ బ్రిడ్జి వద్ద కాలువలో పడేశాడు నిందితుడు ప్రశాంత్. మీ అన్నా వదినల్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి నమ్మించి ప్రసాద్ ఇద్దరు చెల్లెళ్లను వేర్వేరుగా తీసుకెళ్లి ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. అయితే మొదటి 3 హత్యలు ప్రధాన నిందితుడు ప్రశాంత్ ఒక్కడే చేశాడని, తరువాత ముగ్గుర్ని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో వరుస మృతదేహాలు బయటపడటంతో పోలీసులకు సైతం ఏం జరుగుతుంతో అర్థం కాలేదు. అంతలోనే మొత్తం ఆరు హత్యలు జరిగాయి. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. స్నేహితుడి కుటుంబంతో ఏ గొడవలు లేకున్నా, ఆస్తి కోసం ఆ కుటుంబం మొత్తాన్ని అంతం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు సేకరించాక పోలీసులు త్వరలోనే మీడియాకు వివరాలు వెల్లడిస్తామన్నారు.