CM Jagan Launch Upgraded YSR Aarogyasri Scheme: దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. 'వైఎస్సార్ ఆరోగ్య శ్రీ' (YSR Aarogyasri) పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని (Tadepalli) తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పేద ప్రజలకు ఈ పథకం ఓ వరమని, అందుకే పరిమితి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 'వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ కిందకు వస్తుంది. ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంచుతున్నాం. ఈ పథకం కింద చికిత్సలనూ పెంచాం. రాష్ట్రంలో 2,513 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను అందిస్తున్నాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు చేయకూడదనే ఈ పథకం అమలు చేస్తున్నాం.' అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.


క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ కార్డులు


ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త ఫీచర్లతో ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. క్యూఆర్ కోడ్ తో కార్డులో లబ్ధిదారుని ఫోటో, ఇతర వివరాలు తెలుస్తాయని చెప్పారు. రాష్ట్రంలో 1.40 కోట్ల మంది ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తారని, అందరికీ సేవల్ని విస్తరించాలన్న లక్ష్యంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని అన్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు అందించాలని, ఉచిత వైద్యంపై అవగాహన కల్పించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, పార్లమెంట్ స్థానానికి ఓ మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రచిస్తున్నట్లు వివరించారు. 


ఆ 2 యాప్స్ తప్పనిసరి


రాష్ట్రంలో ఎలాంటి పరిమితులు లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని, క్యాన్సర్ వంటి వ్యాధులకు సైతం ఈ పథకం వర్తింపచేశామని సీఎం జగన్ తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు ఉచితంగా మందులు కూడా డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. 'రోగికి కావాల్సిన మందుల వివరాల్ని ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు సెంట్రల్ ఆఫీస్ కు పంపిస్తారు. పోస్టల్ శాఖ ద్వారా విలేజ్ క్లినిక్ కు ఆ మందులు పంపి రోగికి అందేలా చేస్తాం. జనవరి 1 నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 ప్రారంభిస్తాం.' అని వెల్లడించారు. ప్రతి ఇంట్లో దిశ, ఆరోగ్య శ్రీ యాప్స్ ఉండేలా చూడాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. కొత్త కార్డుల్లో రోగికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని, క్యూ ఆర్ కోడ్ ద్వారా రోగి వివరాలన్నీ వైద్యులకు తెలుస్తాయని వెల్లడించారు. ఆరోగ్య శ్రీ సేవల గురించి తెలియని వారు ఎవరూ ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ పథకం కోసం ఏటా రూ.4,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Also Read: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం దరఖాస్తుకు మంగళవారమే ఆఖరు గడువు, వెంటనే అప్లయ్ చేయండి