విరాళాల కోసం కాంగ్రెస్‌ (Congress) పార్టీ డొనేట్‌ ఫర్‌ దేశ్‌ (Donate For Desh) పేరిట క్రౌడ్‌ ఫండింగ్‌ (Crowdfunding ) ప్రారంభించింది. దేశం కోసం విరాళాలు ఇవ్వాలని తొలిసారి కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను కోరుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge) తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో మహాత్మా గాంధీ కూడా దేశ ప్రజల నుంచే విరాళాలను సేకరించారన్న ఆయన, సంపన్నులపై ఆధారపడితే వారి విధివిధానాలను అనుసరించాల్సి వస్తుందన్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


కాంగ్రెస్ కు భారీగా తగ్గిన ఫండింగ్
దేశంలోని బలహీన వర్గాల హక్కులను కాపాడేందుకు, సమాజంలోని అసమానతలను అధిగమించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. సంపన్న వర్గాలకు మద్దతుగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షంగా నిలవాలన్న కాంగ్రెస్‌ నిబద్ధతకు ఇది నిదర్శమని ట్వీట్‌లో పేర్కొంది. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి కొన్నేళ్లుగా విరాళాలు రావడం భారీగా తగ్గింది. 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ఈ ప్రచార, నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజల నంచి రూ.138, రూ.1,380, రూ.13,800... చొప్పున విరాళాలు సేకరించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. 18 ఏళ్లు పైబడిన భారతీయులెవరైనా రూ.138 మొదలు రూ.1380, రూ.13,800 ఆపై ఎంతైనా విరాళం ఇవ్వవచ్చు.  138 ఏళ్ల పార్టీ ప్రయాణాన్ని ఇది గుర్తుచేస్తుందని హస్తం పార్టీ వెల్లడించింది. 


క్రౌండ్ ఫండింగ్ పై బీజేపీ విమర్శలు
కాంగ్రెస్‌ పార్టీ క్రౌడింగ్‌ ఫండింగ్‌పై సామాజిక మాధ్యమాల్లో బీజేపీ విమర్శలు గుప్పించింది. 60 ఏళ్లుగా దేశాన్ని దోచుకున్నవారు ఇప్పుడు విరాళాలివ్వాలని అంటున్నారని ఎద్దేవా చేసింది. ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో దొరికిన నోట్ల కట్టల వ్యవహారం నుంచి దేశం దృష్టి మరల్చడానికే ఇలాంటి పనులు చేస్తోందని మండిపడింది.  1984లో విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘ఇంక్విలాబ్‌’లోని ఓ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేసింది. వీడియో క్లిప్‌లోని కథ, పాత్రలు ఊహాజనితం కాదు. కాంగ్రెస్‌ పార్టీ క్రౌడ్‌ ఫండింగ్‌కు.. ఆ పార్టీ ఎంపీ ధీరజ్‌ సాహు వ్యవహారానికి పోలిక ఉందంటూ ట్వీట్‌లో పేర్కొంది. ధీరజ్‌ సాహు నివాసంలో ఆదాయ పన్ను శాఖ (IT) అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు ఉదంతాన్ని పోలి ఉందని కాషాయపార్టీ విమర్శించింది. ప్రజా ధనాన్ని గాంధీ కుటుంబానికి సమర్పించడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. 






ఎక్కువ మొత్తం ఇవ్వాలనుకుంటే...
కాంగ్రెస్ అఫిషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి దాతలు విరాళాలను ఇవ్వవచ్చు. ఎక్కువ మొత్తం ఇవ్వాలనుకునే వారు వెబ్ సైట్ లోకి వెళ్లి Other ఆప్షన్ ఎంచుకోవచ్చు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు కనీసం రూ.1,380 చొప్పున విరాళం ఇవ్వాలని పార్టీ సూచించింది. ఇది దేశంలోనే అతి పెద్ద క్రౌడ్‌ పుల్లింగ్‌ ఫండ్‌ క్యాంపెయిన్‌ గా నిలవనుంది. పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబరు 28న నాగ్‌పూర్‌లో 10 లక్షల మందితో భారీ ర్యాలీని నిర్వహించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.