Queen Elizabeth II:
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 కు భారత్ కు అవినాభావ సంబంధాలు ఉండేవి. ప్రత్యేకించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మహారాణి ఆహార్యంలో ఓ భారతీయుడు అందించిన ఆభరణాలు జీవితాంతం స్థానం సంపాదించాయంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పాలి. హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన సాగించిన అప్పటి నిజాం అసఫ్ జా 7...యూకే గద్దెనెక్కకముందే క్వీన్ ఎలిజబెత్ కు విలువైన వజ్రాల నగలను కానుకగా అందించారు.
నిజాం తరపున వివాహ కానుక :
1947లో జరిగిన క్వీన్ ఎలిజబెత్ వివాహం సమయంలో నిజాం హైదరాబాద్ నుంచి వజ్రాల హారాలను, నగలను ఓ పెద్ద పేటికలో పంపించారంట. పైగా వాటిలో అప్పటికి రాకుమారి అయిన ఎలిజబెత్ తనకు కావాల్సిన నగలను తీసుకోవచ్చని సందేశాన్ని పంపించారంట. అయితే నిజాం పంపిన నగల్లో మూడొందల వజ్రాలు పొదిగిన ఓ డైమండ్ నెక్లెస్ ను ఎలిజబెత్ స్వీకరించారు. ఆ నెక్లెస్ ఎంతో ఇష్టంగా ధరించేవారు రాణి ఎలిజబెత్.
అధికారిక చిత్రాల్లోనూ అదే నెక్లెస్ :
అప్పట్లో యూకే అధీనంలో ఉన్న కామన్ వెల్త్ దేశాల్లోని నోట్లపై, పోస్టల్ స్టాంపులపై క్వీన్ ఎలిజబెత్ చిత్రాల్లో ఈ నగలు స్పష్టంగా కనిపించేవి. 1952 లో బ్రిటీష్ రాణిగా పట్టాభిషేకమయ్యాక కామన్ వెల్త్ దేశాల్లోని కార్యాలయాల్లో పెట్టే మహా రాణి అధికారిక చిత్రాల్లోనూ నిజాం ప్రభువు సమర్పించిన కానుకలే కనిపించేవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కామన్ వెల్త్ దేశాల్లోనూ నిజాం ప్రభువు నగలతో ఉన్న ఎలిజబెత్ చిత్రాలనే అధికారిక చిత్రాలుగా చెలామణి చేయటం ద్వారా వరల్డ్ వైడ్ ఈ నగలు ఏంటనే చర్చలు నడిచేవి.
రాయల్ ఫ్యామిలీ ఖజానా :
సాధారణంగా బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ కు సంబంధించిన మహిళలంతా అత్యంత విలువైన నగలను ధరిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి కామన్ వెల్త్ దేశాలు సహా అనేక దేశాలు తమ దేశంలోని అత్యుత్తమ నగలు, వజ్రాలు, బంగారంతో ఆభరణాలు తయారు చేసి కానుకలుగా రాణికి పంపించేవారు. నెక్లెస్ లు, ఇయర్ రింగ్స్, బ్రేస్ లైట్స్, వాచెస్ ఇలా ఒక్కో ఆభరణాన్ని ఒక్కో ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దిన డిజైనరీ వేర్స్ వందలు, వేల కొద్దీ బ్రిటీష్ రాయల్ సొసైటీ ఖజనాలో ఉన్నాయి. కానీ నిజాం ప్రభువు కానుకగా సమర్పించిన డైమండ్ నెక్లెస్ వాటిన్నింటిలో కంటే ప్రత్యేకమైనది, విలువైనదిగా భావిస్తారు.
నిజాం డైమండ్ నెక్లెస్ ధర :
రాయల్ సొసైటీ ఫోటోగ్రాఫర్ డొరొతీ వైల్డింగ్ తీసిన క్వీన్ ఎలిజబెత్ నగల ఫోటోలు నేటికీ రాయల్ ఫ్యామిలీ డిస్ ప్లే స్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రిన్స్ విలియం భార్య డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి కేథరిన్ కు మాత్రమే ఆ డైమండ్ నెక్లెస్ ను అప్పుడప్పుడూ ధరించేందుకు క్వీన్ ఎలిజబెత్ అనుమతినిచ్చారు. ఇంతకీ నిజాం ప్రభువు సమర్పించిన ఆ నగ విలువ ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం 66 మిలియన్ యూరోలు...అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 530 కోట్ల రూపాయలు.