QR Codes Posted In Bengaluru: 


బెంగళూరులో ఏర్పాటు... 


బెంగళూరు ట్రాఫిక్‌ ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరుకైన దారుల కారణంగా...ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి అక్కడి రోడ్లు. ఇక సిగ్నల్స్ వద్ద వేచి ఉండే వాళ్లకైతే చుక్కలు కనబడతాయి. ఒక్కోసారి ఈ ట్రాఫిక్ కారణంగా కొందరు ఆరోగ్య సమస్యలూ ఎదుర్కొంటున్నారు. అంత ట్రాఫిక్‌లో ఎవరికైనా ఏమైనా అయితే...అప్పటికప్పుడు ఆంబులెన్స్ వచ్చే వీలు కూడా ఉండట్లేదు. కనీసం
ప్రాథమిక చికిత్సకూ అవకాశం చిక్కట్లేదు. అందుకే...అక్కడి ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ సమస్యకు డిజిటల్ పరిష్కారాన్ని కనుగొంది. కార్డియాక్ ఎమర్జెన్సీ సమయంలో అవసరమయ్యే మెడికల్ సర్వీస్‌లతో పాటు ఎవరైనా ప్రమాదానికి గురైతే వారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా QR Codeలు అందుబాటులోకి తీసుకొచ్చింది. సిటీలోని అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఈ QR కోడ్స్ అందుబాటులో ఉంటాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికే BBMP,మణిపాల్ హాస్పిటల్స్ సంయుక్తంగా ఈ సేవలు అందిచనున్నాయి. ఈ మేరకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ వివరాలు వెల్లడించారు. ఏదైనా అత్యవసరమైతే..ఈ QR కోడ్స్‌తో వైద్య సేవల్ని అత్యంత వేగంగా పొందేందుకు అవకాశముంటుంది. ఆంబులెన్స్ క్షణాల్లో అక్కడికి వచ్చి మల్టీస్పెషాల్టీ ఆసుపత్రికి తీసుకెళ్తుంది. గత వారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా..ఈ ఎమర్జెన్సీ సర్వీస్‌లను ప్రారంభించారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల సాయంతో ఈ QR కోడ్స్‌ని ఏర్పాటు చేసినట్టు మణిపాల్ హాస్పిటల్ సిబ్బంది వెల్లడించింది. ఈ కోడ్స్‌ను ఎలా వినియోగించాలో అక్కడే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. గుండెపోటు వచ్చిన సందర్భంలో ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. 


ట్రాఫిక్ తగ్గించేందుకు..


బెంగళూరులో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు అక్కడి పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్...గూగుల్‌తో భాగస్వామ్యం అవుతున్నట్టు ఇటీవలే అధికారికంగా వెల్లడించారు. "బెంగళూరులో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు గూగుల్‌తో చేతులు కలుపుతున్నందుకు ఆనందంగా ఉంది. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో ఆ సంస్థ మాకు సహకరించనుంది. లక్షలాది మంది వాహన దారులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ఈ మధ్యే పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. సిటీలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ లైట్స్‌ను... గూగుల్ ఆప్టిమైజ్ చేస్తోంది. ఫలితంగా... వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవస్థ తప్పింది" అని కమిషనర్ తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయ వంతం కావటం వల్ల మరో అడుగు ముందుకు వేశారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు గూగుల్‌ నుంచి ఇన్‌పుట్స్ తీసుకోనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా గూగుల్ సిటీలోని డ్రైవింగ్ ట్రెండ్స్‌ను పోలీస్‌లకు అందిస్తుంది. అందుకు అనుగుణంగా రివైజ్డ్‌ ప్లాన్ ఇస్తుంది. ఈ డేటాను ఆధారంగా చేసుకుని ట్రాఫిక్‌ను సులువుగానే కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. దాదాపు అన్ని సిగ్నల్స్ వద్ద 20% మేర వెయిటింగ్ టైమ్ తగ్గిపోయింది. టైమ్‌తో పాటు ఫ్యూయెల్‌ కూడా ఆదా అవుతోంది. 


Also Read: Gujarat Assembly Election: ఎన్నికలకు రెడీ అవుతున్న గుజరాత్, త్రిముఖ పోరులో గెలిచేదెవరో?