Gujarat Assembly Election: ఎన్నికలకు రెడీ అవుతున్న గుజరాత్, త్రిముఖ పోరులో గెలిచేదెవరో?

Gujarat Assembly Election: ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

Continues below advertisement

Gujarat Assembly Election:

Continues below advertisement

మూడు పార్టీలకు సవాల్ ఇది..

గుజరాత్...అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే భాజపా, ఆప్ ప్రచారం మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఎన్నికల తేదీలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా తరచు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చి తన కంచుకోటను కాపాడుకోవాలని భాజపా గట్టి సంకల్పంతో ఉంది. అటు...కాంగ్రెస్ గుజరాత్‌లో అధికారం కోల్పోయి 27 ఏళ్లు దాటింది. ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టి...ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా భాజపాకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గుజరాత్‌లో ఆప్ గెలిస్తే...కేజ్రీవాల్ తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుని 2024 ఎన్నికల్లో మోదీతో తలపడే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకే...గుజరాత్‌లో గెలవటాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఆప్. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఆప్ మంచి ఫలితాలు రాబడితే...పాన్ ఇండియా పార్టీగా ముద్ర పడిపోతుంది. ప్రస్తుతానికి...ఆప్, కాంగ్రెస్, భాజపా మధ్య త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ మూడు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు తరచూ గుజరాత్‌లో పర్యటిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ పార్టీల ప్రకటనలకు సంబంధించిన ఫ్లెక్సీలతోనే నిండిపోయాయి. 

వేగం పెరిగిన ప్రచారం
 
"ఈ నెలలో ఎప్పుడైనా ఎన్నికల తేదీలు వెలువడుతుండొచ్చు. అందుకే...అన్ని పార్టీలు తమ ప్రచార వేగాన్ని రెట్టింపు చేసే పనిలో నిమగ్నమయ్యాయి" అని గుజరాత్ రాజకీయ పరిశీలకుడు హరిదేశాయ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత వారం కేంద్ర మంత్రి అమిత్‌షా గుజరాత్‌లో రెండ్రోజుల పాటు పర్యటించారు. స్థానిక నేతలతో సమావేశమై...ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఇకపై తరచుగా రాష్ట్రానికి వచ్చి స్థానిక నేతలతో భేటీ అవనున్నారు. ఈ వారం ప్రధాని మోదీ కూడా రెండ్రోజుల పాటు గుజరాత్‌లో సుడిగాలి పర్యటన చేశారు. రూ.27,000కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అహ్మదాబాద్ ట్రైన్ సర్వీసులతో పాటు...గాంధీనగర్ నుంచి ముంబయి వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌నూ  అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. అటు ఆప్‌ నేతలు కేజ్రీవాల్, భగవంత్ మాన్‌ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ గుజరాత్ ఇంచార్జ్ రఘు శర్మ...ప్రచారానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఆప్ మాత్రం ఈ విషయంలో ముందే ఉంది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో ఇప్పటికే 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్..గత వారం రాష్ట్రంలో పర్యటించారు. రాజకీయ పార్టీలతో, ఉన్నతాధికారులతో చర్చించారు. ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో సమీక్షించారు. అటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పార్టీలు ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

Also Read: Minister KTR : బీజేపీ పేరు ఇలా మార్చేసుకోండి, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్

Continues below advertisement