ఉక్రెయిన్‌ను దిగ్బంధిస్తున్న రష్యా సైన్యం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై 100రోజులు దాటింది. ఇప్పటికీ అక్కడి పరిస్థితులేమీ చక్క బడలేదు. ఉక్రెయిన్‌ను నలువైపులా చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకుంటోంది రష్యా సైన్యం. తీర ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధించి ఉక్రెయిన్‌కు వాణిజ్య సంబంధాలు లేకుండా చేసింది. ఇప్పటికే కీలకమైన ప్రాంతాలపై పట్టు సాధిస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది రష్యా. అంతర్జాతీయంగా ఎన్ని హెచ్చరికలు వస్తున్నా పుతిన్ ఏ మాత్రం తగ్గటం లేదు. ఐక్యరాజ్య సమితి మాటల్నీ పట్టించుకోవటం లేదు. పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినా లెక్క చేయకుండా దాడుల తీవ్రతను పెంచుతూ వస్తున్నారు పుతిన్. అటు ఉక్రెయిన్ పూర్తిగా చేతులెత్తేయకుండా గట్టిగానే పోరాటం చేస్తోంది. రష్యా సైన్యం వ్యూహాలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం ఇన్ని రోజుల పాటు కొనసాగటానికి కారణమూ...ఉక్రెయిన్ ప్రతిఘటనే. పైగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధ సహకారం అందిస్తుండటం ఆ దేశ ఆత్మస్థైర్యాన్ని పెంచుతోంది. ఆ ఆయుధాలతో రష్యా సైన్యంపై ప్రతిదాడులకు దిగుతున్నాయి ఉక్రెయిన్ సేనలు.
పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పుతిన్
పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు సహకరించటంపై ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు పుతిన్. ఇప్పుడు ఆయా దేశాలు ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలు అందించాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పుతిన్ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు అమెరికా లాంగర్ రేంజ్ క్షిపణులను సరఫరా చేయటం ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తమ మాట కాదని సప్లై చేస్తే ఉక్రెయిన్‌లో ఇంత వరకూ దాడి చేయని ప్రాంతాలేమిటో జల్లెడ పట్టి వాటిపైనా బాంబుల వర్షం కురిపిస్తామని అన్నారు. కానీ ఆ ప్రాంతాలేమిటి అన్నది మాత్రం
స్పష్టంగా చెప్పలేదు. రష్యాలోని ఓ స్థానిక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
పశ్చిమ దేశాలు పుతిన్ హెచ్చరికలను ఖాతరు చేస్తాయా..?
ఇప్పటికే ఉక్రెయిన్ సేనలు రష్యా సైన్యంపై మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్‌తో విరుచుకు పడుతున్నాయి. తద్వారా రష్యా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. హిమర్స్ అనే అధునాతన రాకెట్ సిస్టమ్స్‌ని ఉక్రెయిన్‌కు అందించేందుకు అమెరికా అంగీకరించింది. కానీ అందుకో ఓ కండీషన్ పెట్టింది. రష్యాపై వీటిని ప్రయోగించకూడదని తేల్చి చెప్పింది. అయినా పుతిన్ మాత్రం అమెరికా నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్రిక్తతలను ఇంకా పెంచొద్దని హెచ్చరించారు. ఒకవేళ అమెరికా తమ హెచ్చరికలను పట్టించుకోకపోతే తమ దాడుల తీవ్రతను ఇంకా పెంచాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై విరుచుకు పడుతోంది రష్యా సైన్యం. పశ్చిమ దేశాలు పుతిన్ హెచ్చరికలను కాదంటే ఇంకొన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.