ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి, శరభవరం, పొదురుపాక తదితర గ్రామాల ప్రజల్లో ఇంకా పులి ఆందోళన కొనసాగుతూనే ఉంది. దాన్ని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోన్లలో చిక్కుకుంటుందేమోనని ఆశించగా, అక్కడి వరకూ వచ్చి వెళ్లిపోయింది. ఒడిశా అడవుల నుంచి తప్పిపోయి, బెంగాల్‌ టైగర్‌ దారి తప్పి ఒమ్మంగి పరిసరాల్లోకి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా గుర్తించిన ఆనవాళ్ల ప్రకారం... అది మగ పులి అని, ఆరోగ్యంగా ఉందని, 150 కిలోల బరువు దాకా ఉంటదని అంచనాకు వచ్చారు. ఒడిషా అడవుల నుంచి ఆడ పులి కోసం వెతుకుతూ.. దారి తప్పి ఇటువైపు వచ్చి ఉంటుందని శ్రీశైలం రిజర్వ్‌ ఫారెస్ట్‌ నిపుణులు తెలిపారు. 


దీనిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోనులో ఆవు ఆహారం ఉంచారు. దాన్ని తినేందుకు వచ్చి పులి అందులో చిక్కుకుంటుందని భావించారు. కానీ చుట్టుపక్కల అక్కడ కొన్నిచెట్లు కొట్టి ఉంచడం, గొయ్యి తవ్విన ఆనవాళ్లు ఉండడంతో పులి జాగ్రత్త పడి తప్పించుకుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ పెద్ద పులి ఇప్పటి వరకు మనిషి రక్తం రుచి చూడలేదని.. అందుకే మనుషుల జోలికి రావడం లేదని నిపుణులు చెప్పారు.


పట్టుకునేందుకు మరో వ్యూహం, అనుమతులు కూడా
రోజులు గడుస్తున్నా పులి దొరక్కపోవడంతో చివరి ప్రయోగంగా మత్తు ఇంజక్షన్‌లు వాడి పట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం శుక్రవారం జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అనుమతి లభించింది. శుక్రవారం రాత్రి నుంచే నైట్‌ విజన్‌ పరికరాల ద్వారా పులి ఆచూకీ కోసం చూస్తున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చాక, అర గంట వ్యవధిలో పులి నీళ్లు తాగేందుకు వెళ్లి చెరువులో పడిపోయినా, కొండలపై నుంచి జారిపడ్డా పులి చనిపోతుంది. 


అందుకే నీళ్లు, ఎత్తైన ప్రదేశాలు లేని చోట పులి కనిపిస్తేనే పరిస్థితి లేని చోట కనిపిస్తేనే మత్తు ఇంజక్షన్‌ను దూరం నుంచి ప్రయోగిస్తామని అధికారులు తెలిపారు. పెద్దపులి పట్టుబడిన తర్వాత ఏవైనా గాయాలు ఉంటే విశాఖ జూకి తరలించి చికిత్స అందిస్తామని, అది ఆరోగ్యంగా ఉంటే అడవుల్లో వదులుతామని అన్నారు.


బయటికి రావొద్దని సూచనలు
మే 26 నుంచి ప్రత్తిపాడు మండలంలో పులి కదలికలను స్థానికులు గుర్తించారు. పోతులూరులో ఓ పశువుని పులి చంపింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై బోన్ లు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ అధికారులు అమర్చిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఫొటోలు పడ్డాయి. గురువారం పాండవుల పాలెంలో పెద్దపులి ఆవును చంపేసింది. పోతులూరు, పాండవులపాలెం, వొమ్మంగి, శరభవరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సాయంత్రం 5 నుంచి ఉదయం 7 వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు ప్రకటన చేశారు. పశువుల్ని పొలాల్లో కాకుండా ఇళ్ల వద్ద కట్టేయాలని సూచించారు.