Russia NATO Clash:


నాటో దళాలు దిగితే..


ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంపై అంతర్జాతీయంగా నాలుగైదు నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎన్ని హెచ్చరికలు చేసినా పుతిన్ పట్టించుకోవటం లేదు. ఐక్యరాజ్య సమితి వారించినా...అదే పరిస్థితి. అన్ని దేశాలు మూకుమ్మడిగా మాటల యుద్ధం చేస్తున్నా...రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. అటు ఉక్రెయిన్ కూడా గట్టిగానే పోరాడుతోంది. రష్యా ఆక్రమిత ప్రాంతాలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే...అటు నాటో దళాలు కూడా రష్యాను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగనున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా నేతృత్వం వహించే నాటో దళాలు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే...అప్పుడది రష్యా వర్సెస్ అమెరికా యుద్ధంగా మారిపోక తప్పదు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...పుతిన్‌ను చాలా సందర్భాల్లో హెచ్చరించారు. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించి మరీ కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టిగానే బదులిస్తామని తేల్చి చెప్పారు. అటు పుతిన్ కూడా ఈ సారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ నాటో దళాలు కనుక రష్యా సైన్యంతో తలపడేందుకు సిద్ధమైతే "మహా విపత్తు" వస్తుందనిహెచ్చరించారు. కజికిస్థాన్‌ రాజధాని అస్టానాలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్. "నాటో దళాలు రష్యా ఆర్మీతో నేరుగా యుద్ధం చేసేందుకు వస్తే మా తరవాతి వ్యూహం చాలా 
ప్రమాదకరంగా ఉంటుంది. బహుశా అది మహా విపత్తుకి దారి తీయొచ్చు. దీని గురించి కాస్త తెలివిగా ఆలోచించి అలాంటి పని చేయకుండా ఉంటారని ఆశిస్తున్నా" అని స్పష్టం చేశారు. 


అణు హెచ్చరికలు..


గతంలో ఎన్నో సార్లు పుతిన్ "అణు"హెచ్చరికలు చేశారు. వీటిని అంత తేలిగ్గా తీసుకోకూడదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పుతిన్ మరోసారి అలాంటి హెచ్చరికలే చేయటం కలవర పెడుతోంది. బెలారస్‌ విదేశాంగశాఖ మంత్రి వ్లాదిమిర్‌ మేకీ  ఓ రష్యా పత్రికతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు కచ్చితంగా స్పందిస్తామన్నారు. సరిహద్దు దేశాల నుంచి వచ్చే కవ్వింపులకు స్పందించేలా తమ సైన్యం, ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ వారం బెలారస్‌లో సైనిక కదలికలు తీవ్రమైన సమయంలో వ్లాదిమిర్‌ మేకీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో.. రష్యాకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. రష్యా బలగాలతో కలిసి ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద తమ బలగాలను మోహరించాలని ఆయన ఆదేశించారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల ప్రయోగానికి కూడా వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల హెచ్చరించారు. అయితే తాజాగా మూడో ప్రపంచ యుద్ధం (Russia Warns World War III Against Ukraine) రావొచ్చని రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకొవడం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్‌ వెన్డిక్టోవ్‌ హెచ్చరించారు.


Also Read: Paratha GST: పరాటాలంటే చపాతీల్లా కాదు, తినే ముందు వాత తప్పదు!