రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎట్టకేలకు దేశం దాటి అడుగు బయటపెట్టనున్నారని, తొలి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబరులో ఆయన చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు మీడియా కథనాల సమాచారం. బీజింగ్‌లో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వార వెల్లడైంది. ఈ పర్యటనకు సంబంధించి పుతిన్‌ షెడ్యూల్‌ సిద్ధం అవుతున్నట్లు సమాచారం.


ఉక్రెయిన్‌ యుద్ధ నేరాల నేపథ్యంలో పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ చేసింది. ఉక్రెయిన్‌లో చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేసిన యుద్ధ నేరాలతో సంబంధం ఉన్న ఘటనల నేపథ్యంలో ఆయనపై వారెంట్‌ ఇష్యూ అయినట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ఈ అరెస్ట్‌ వారెంట్‌ వచ్చినప్పటి నుంచి పుతిన్‌ రష్యా దాటి బయటకు రాలేదు. ఎలాంటి విదేశీ పర్యటనకు కూడా వెళ్లలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాలకు కూడా పుతిన్‌ హాజరుకాలేదు. ఇప్పుడు భారత్‌లో జరగనున్న జీ 20 సమావేశాలకు కూడా తాను రావడం లేదని ముందుగానే ప్రధాని మోదీకి ఫోన్‌ కాల్‌ ద్వారా స్పష్టంచేశారు. తనకు బదులుగా తమ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ సదస్సుకు హాజరవుతారని చెప్పారు.  


ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ కారణంగా ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో పుతిన్‌ కనిపిస్తే అరెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే పుతిన్‌ రష్యా దాటి బయటకు రావడం లేదు. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో సుమారు 120 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే ఈ అక్టోబరులో చైనాలో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సుకు హాజరుకావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పుతిన్‌ను ఆహ్వానించారు. ఇందుకు పుతిన్‌ కూడా అంగీకరించినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. పుతిన్‌ చైనా వెళ్లనున్నట్లు వచ్చిన బ్లూమ్‌ బర్గ్‌ రిపోర్ట్‌పై మీడియా వర్గాలు పుతిన్‌ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ను అడగగా.. రష్యా, చైనా ద్వైపాక్షిక చర్చల గురించి అత్యున్నత స్థాయిలో షెడ్యూల్‌ సిద్ధం అవుతోందని, పూర్తి వివరాలు ఈవెంట్‌ల గురించి సమయానుగుణంగా వెల్లడిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో.. చైనాతో బంధం పెరుగుతోంది. 


2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి పుతిన్‌ పొరుగున ఉన్న మునుపటి సోవియట్‌ యూనియన్‌ దేశాలు, ఇరాన్‌ తప్ప మరెక్కడికీ వెళ్లలేదు. కీవ్‌లో సైనిక దాడులు ప్రారంభించే ముందు మాత్రం చైనాకు వెళ్లారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈ ఏడాది మార్చిలో మాస్కోలో పర్యటించారు. జిన్‌ఫింగ్‌ చైనా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన తర్వాత తొలుత రష్యాకే వెళ్లారు. కాగా పుతిన్‌ కేవలం తనకు పూర్తి రక్షణ ఉంటుందని అని భావించిన దగ్గరికి మాత్రమే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, అందులో చైనా ఒకటని సంబంధిత వర్గాలు తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదికలో పేర్కొంది. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య గత ఏడాది నుంచి యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య  పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటికి కూడా ఇంకా ఇరు దేశాలు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్‌లోని కొన్ని భూభాగాలను ఆక్రమించింది కూడా. పరిస్థితులు చేతులు దాటితే అణు యుద్ధానికి భయపడబోనని పుతిన్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.