LPG Cylinder New Price: రాబోయే రాష్ట్రాల & సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, వంట గ్యాస్‌ ధరను భారీగా తగ్గిస్తూ నిన్న (మంగళవారం, 29 ఆగస్టు 2023) ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. గృహ వినియోగదార్లందరికీ సిలిండర్‌కు రూ. 200 చొప్పున వంట గ్యాస్ ధరలను (Domestic LPG Cylinder Price) తగ్గించింది. తగ్గిన ధర నేటి (బుధవారం, 30 ఆగస్టు 2023) నుంచి అమల్లోకి వచ్చింది. జులై నెలలో 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44%కి పెరిగిన ద్రవ్యోల్బణం దెబ్బకు విలవిల్లాడుతున్న కోట్లాది మంది సామాన్య జనానికి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం భారీ ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. 


వంట గ్యాస్‌ రాయితీ ఇవ్వకూడదని 2020లో నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, సబ్సిడీలను మళ్లీ స్టార్ట్‌ చేయాలని తాజాగా నిర్ణయించింది.


ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద మరో రూ.200 సబ్సిడీకి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో, ఉజ్వల పథకం లబ్ధిదార్లకు ఒక్కో సిలిండర్‌ మీద మొత్తం సబ్సిడీ రూ.400 అవుతుంది. రక్షా బంధన్, ఓనం సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన బహుమతిగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అభివర్ణించారు.


వంటగ్యాస్ ధర తగ్గింపు నిర్ణయంతో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఖజానా మీద రూ.7,500 కోట్ల భారం పడుతుందని అంచనా. 


దేశవ్యాప్తంగా కొత్త వంట గ్యాస్‌ ధరలు ఇవి
గతంలో, దిల్లీలో 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1103 ఉండగా, రూ.200 తగ్గిన తర్వాత ఈ రోజు (బుధవారం) నుంచి రూ.903 వద్దకు చేరింది. ముంబైలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ కొత్త రేటు రూ. 902.50 (గతంలో రూ. 1102.50), కోల్‌కతాలో రూ. 929.00 (అంతకుముందు రూ. 1129.00), చెన్నైలో రూ. 918.50 (గతంలో రూ. 1118.50), బెంగళూరులో రూ. 905.50 ‍‌(గతంలో రూ. 1,105.50) జైపుర్‌లో రూ. 906.50 (గతంలో రూ. 1106.50), భోపాల్‌లో రూ. 908.50 (గతంలో రూ. 1,108.50) వద్దకు దిగి వచ్చింది.


తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధరలు ఇవి
దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ (రెడ్‌ సిలిండర్‌) ధర హైదరాబాద్‌లో రూ. 955 (రూ.200 తగ్గింపునకు ముందు రూ. 1,155) దగ్గరకు; విజయవాడలో రూ. 927 (రూ.200 తగ్గింపునకు ముందు రూ. 1127) దగ్గరకు చేరాయి. రవాణా ఛార్జీలను బట్టి ఈ రేట్లలో స్వల్ప తేడాలు ఉండవచ్చు.


ఈ నెల ప్రారంభంలో, కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) 100 రూపాయలు తగ్గించాయి. దీంతో, దేశ రాజకీయ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ సిలిండర్ రేటు రూ. 1680కి దిగి వచ్చింది. ఈ నెలంతా ఇదే రేటు అమల్లో ఉంటుంది. జులై నెలలో ఒక్కో సిలిండర్‌ కోసం రూ. 1780 ఖర్చు చేయాల్సి వచ్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ‍‌(Commercial LPG Cylinder Price) రూ. 1733.50 నుంచి రూ. 1640.50కి దిగి వచ్చింది. కోల్‌కతాలో 1802.50, చెన్నైలో రూ. 1852.50, హైదరాబాద్‌లో రూ. 1918, విజయవాడలో రూ. 1850.50 వద్దకు చేరాయి.


LPG సిలిండర్ రేటును ఎక్కడ చెక్‌ చేయాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్‌ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్‌, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.


మరో ఆసక్తికర కథనం: ఫారినర్ల మనస్సు దోచిన మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌, వాటి కోసం ₹1.8 లక్షల కోట్లు ఖర్చు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial