రజనీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి' చిత్రం అప్పట్లో సంచనల విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన 18 ఏళ్లకు ఆ మూవీ సీక్వెల్ రూపొందుతోంది. ‘చంద్రముఖి 2’గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించబోతోంది. తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
నా జీవితంలో తొలిసారి అడిగాను- కంగనా
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని చెన్నైలో చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కంగనా రనౌత్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన జీవితంలో ఇప్పటి వరకు ఎవరినీ అవకాశాల కోసం అడగలేదని చెప్పింది. కానీ, తొలిసారి దర్శకుడు పి. వాసుతో చంద్రముఖిగా నటించడానికి నేను సరిపోతానా? అని అడిగినట్లు వెల్లడించింది. తన ప్రశ్నకు ఆయన కాసేపు ఆలోచించి ఓకే చెప్పారని వివరించింది. ఈ చిత్రంలో తన పాత్ర తన సినీ కెరీర్ లోనే ఓ మైలు రాయిగా నిలువబోతుందన్నారు.
వాసుతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది- లారెన్స్
ఇక నాలుగు దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్న వాసుతో పని చేయడం సంతోషంగా ఉందని హీరో లారెన్స్ తెలిపారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పటి నుంచే పి వాసు దర్శకత్వం వహించిన చిత్రాలకు పని చేశానని చెప్పారు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా సినిమాలు తెరకెక్కించిన తాను హీరోగా చేయబోతున్న సినిమాకు ఆయన దర్శకత్వం వహించడం హ్యాపీగా ఉందన్నారు. ఈ చిత్రంలో తాను వేట్టైయాన్ క్యారెక్టర్ చేసినట్లు వివరించారు. తన పాత్రకు దక్కే ప్రశంసలు అన్నీ ఆయనకే చెందుతాయన్నారు.
సంచలన విజయాన్ని అందుకున్న ‘చంద్రముఖి’
2005లో విడుదలైన ‘చంద్రముఖి’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక నటించారు. ఈ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక కనబర్చిన నటనకు అప్పట్లో ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. గంగ అనే క్యారెక్టర్ లో చాలా అమాయకంగా కనిపస్తూనే చంద్రముఖి అనే భయానక పాత్రలో నటించి మెప్పించింది. చంద్రముఖిగా ఆమె డ్యాన్సును చూసి.. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అప్పట్లో రూ. 9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. చంద్రముఖి మలయాళ మూవీ ‘మణిచిత్రతాజు’ అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ‘భూల్ భులైయా’గా తెరకెక్కింది. ఈ సినిమా కూడా అక్కడ బాగానే ఆడింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial