Tarn Taran Police Station:
అర్ధరాత్రి దాడి..
పంజాబ్‌లోని టర్న్ టరన్ పోలీస్ స్టేషన్‌పై బాంబు దాడి జరిగింది. రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (RPG)తో దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది లో ఇంటెన్సిటీ బాంబు అని తెలిపారు. రాకెట్ లాంచర్ తరహా ఆయుధాన్ని పోలీస్ స్టేషన్‌పై విసిరినట్టు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి 1 గంటకు అమృత్ సర్ - బఠిండ హైవే పరిసరాల్లోని సర్హాలీ పోలీస్ స్టేషన్‌పై ఈ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పోలీస్ స్టేషన్ డోర్ గ్లాస్ ధ్వంసమైంది. సీనియర్ అధికారులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులు పరిశీలిస్తున్నారు. డీజీపీ ప్రత్యేకంగా వచ్చి దీనిపై విచారించనున్నారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మజీందర్ సింగ్ సిర్సా పంజాబ్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. వరుస ట్వీట్‌లు చేశారు. "ఆప్ పంజాబ్ గుజరాత్, ఢిల్లీలో సంబరాలు చేసుకుంటోంది. సీఎం భగవంత్ మాన్ రాష్ట్ర శాంతి భద్రతలను గాలికొదిలేశారు" అని విమర్శించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా కూడా ఆప్‌పై మండి పడ్డారు.
"మున్ముందు ప్రమాదాలకు ఇదే హెచ్చరిక. పోలీసులపై దాడి చేయడం పంజాబ్ రాష్ట్ర శాంతి భద్రతలకు మంచిది కాదు. దీనిపై సమష్టిగా పోరాడాలి. కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇలాంటి దాడులను నిర్లక్ష్యం చేయొద్దు" అని ట్వీట్ చేశారు. గతంలోనూ పంజాబ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. మొహాలీలోని పంజాబ్ పోలీస్ నిఘా విభాగం హెడ్‌క్వార్టర్స్‌పైనా రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్‌తో దాడి జరిగింది. మే 9 వ తేదీన సాయంత్రం ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఆప్ పట్టించుకోవడం లేదని బీజేపీ సహా కాంగ్రెస్ విమర్శిస్తోంది.