Punganur Violence: చిత్తూరు జిల్లా పుంగనూరు విధ్వంసక ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబుపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. మొత్తం ఆరు కేసుల్లో 246 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి. అన్నింటిలోనూ ఏ1గా చల్లాబాబు పేరును చేర్చారు. ఈక్రమంలోనే అతడిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే కడప సెంట్రల్ జైలుకు 61 మందిని, చిత్తూరు జైలుకు 13 మందిని రిమాండ్ కు తరలించారు. మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో ఈ నెల 4న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అంగళ్లు, పుంగనూరులో ఘర్షణలు జరిగాయి. ప్రాజెక్టుల సందర్శన పేరుతో టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబుతోపాటు నేతలంతా ప్రసంగించారంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ఘర్షణల్లో మొత్తం 245 మందిపై కేసు నమోదు చేశారు. 74 మందిని అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం పోలిసులు గాలిస్తున్నారు.
ఈ అల్లర్లకు టిడిపి నాయకులే కారణంగా చూపిస్తూ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, చల్లా బాబు(రామచంద్రారెడ్డి), పులివర్తి నానిపై కేసులు నమోదు చేశారు. ఏడు చార్జ్ షీట్‌లు నమోదు చేయగా ఇందులో ప్రధాన నిందితుడిగా చల్లా బాబు అలియాస్ రామచంద్రారెడ్డిని చూపించారు. చిత్తూరు సిసిఎస్ కానిస్టేబుల్ లోకేష్ ఫిర్యాదు మేరకు మంగళవారం రోజు మరో రెండు కేసులు నమోదు చేశారు. పుంగనూరు టిడిపి ఇంచార్జ్ చల్లా బాబుతో పాటు చౌడేపల్లి, పులిచెర్ల మండలాల టిడిపి శ్రేణులపై కేసులు పెట్చేటారు.
అనంతపురానికి చెందిన మరో ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఫిర్యాదు మేరకు చల్లా బాబు తో పాటు, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి నియోజవర్గానికి సంబంధించిన 39 మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తం కేసుల్లో ఏ 1గా పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.
ఘటన జరిగిన తర్వాత నుంచి చల్లా బాబు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు ట్రై చేస్తున్నామని ఆచూకీ మాత్రం తెలియడం లేదన్నారు. అందుకే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.
అంగళ్లు ఘర్షణల్లో ఏ1 గా చంద్రబాబు
పుంగనూరు, అంగళ్లు హింసాత్మక ఘటన కేసులు మరో మలుపు తిరగాయి. ఇందులో ఏ1 గా టీడీపీ అధినేత చంద్రబాబును చేరుస్తూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆయనతోపాతు ఏ2గా దేవినేని ఉమామహేశ్వరరావు, ఏ3గా అమర్‌నాథ్ రెడ్డిని చేర్చారు. అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్‍లో కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు.
అన్నమయ్య జిల్లా ముదివేడులో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమరనాథ్ రెడ్డి, ఏ4గా చల్లా బాబుపై కేసు నమోదు చేశారు. అయితే ప్రాజెక్టుల సందర్శన పేరుతో టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు ప్రసంగించారంటూ ఏఫ్ఐఆర్‌లో పోలీసులు నమోదు చేశారు.