Viral News in Telugu: ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలు, వీడియోల కోసం సాహసాలు చేస్తున్నారు. ఇలాంటి సాహసం చేయబోయిన ఓ మహిళ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్రలోని బొరానే ఘాట్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ఆమె లోయలో పడిపోయింది. ఇది గుర్తించిన స్థానికులు మరో హోమ్‌గార్డ్ సహకారంతో ఆమెని బయటకు తీసుకొచ్చారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. నదులు ఉప్పొంగుతున్నాయి. అక్కడి తోసేఘర్ జలపాతం కూడా పోటెత్తుతోంది. ఈ వాటర్‌ఫాల్స్‌ని చూసేందుకు కొంత మంది అక్కడికి వచ్చారు. అక్కడ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన నస్రీన్ అమీర్ ఖురేషీ కాలు జారి 60 అడుగుల లోతైన లోయలో పడింది. తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగోలా ఆమెని బయటకు తీసుకొచ్చి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితురాలిని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కొన్ని చోట్ల టూరిస్ట్‌లు వస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్‌ల కోసం ఇలా ప్రమాదకర స్టంట్‌లు చేస్తున్నారు.