Pune Porsche accident celebration video: పుణె పోర్షే కారు ప్రమాద కేసు.. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ విషాద ఘటన ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. నిందితులకు బెయిల్ రావడం, ఆ తర్వాత వారు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు బయటకు రావడం బాధితుల కుటుంబాల్లో తీరని ఆవేదనను నింపుతోంది.
2024 మే నెలలో పుణెలో మద్యం మత్తులో ఓ మైనర్ నడిపిన పోర్షే కారు ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను బలిగొన్న ఘటనను ఎవరూ మర్చిపోలేరు. ఈ కేసులో విచారణ పేరుతో సాగిన ప్రహసనం ఇప్పుడు బాధితుల ఆవేదనకు పరాకాష్టగా మారింది. నిందితుడైన మైనర్‌కు అప్పట్లోనే కేవలం రోడ్డు భద్రతపై వ్యాసం రాయాలి అనే వింత కండిషన్‌తో బెయిల్ ఇవ్వడం ఒక ఎత్తైతే, తాజాగా నిందితుడి తండ్రికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. మరీ ముఖ్యంగా, బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుల కుటుంబం భారీ పార్టీలు చేసుకుంటూ, నోట్ల దండలతో డ్యాన్స్‌లు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది.
చట్టం అంటే భయం లేదు - బాధితురాలి తండ్రి ఆవేదన
ఈ పరిణామాలపై మరణించిన అశ్విని కోష్ఠ తండ్రి సురేష్ కోష్ఠ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తులను చంపి సంబరాలు చేసుకోవడం వారి సమాజంలో అలవాటు కాబోలు.. ఇది సామాన్య పౌరులను అవహేళన చేయడమే అంటూ ఆయన నిప్పులు చెరిగారు. చట్టంలోని లొసుగులను వాడుకుని శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని, మైనర్ అనే ముసుగులో వారు ఏమైనా చేయవచ్చనే ధీమాతో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు హైకోర్టు శిక్ష వేస్తే, సుప్రీంకోర్టు వదిలేస్తోందని.. ఇది నేరస్తులను ప్రోత్సహించడమేనని ఆయన విమర్శించారు.
రక్తంకు రక్తం.. కఠిన చట్టాలు రావాలి!
భారతదేశంలో చట్టం పట్ల భయం పోయిందని, ముస్లిం దేశాల్లో ఉన్నట్లుగా రక్తంకు రక్తం అనే కఠిన శిక్షలు అమల్లోకి వస్తేనే ఇలాంటి ఆగడాలు ఆగుతాయని సురేష్ కోష్ఠ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెను కోల్పోయిన బాధలో ఉన్న ఆయన, నిందితులకు బెయిల్ రద్దు చేయాలని, వారి తల్లిదండ్రులను మళ్లీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగకుండా, నిందితులు హీరోల్లా సంబరాలు చేసుకోవడం మాయని మచ్చ అని ఆయన పేర్కొన్నారు.
సాక్ష్యాల తారుమారు.. అడుగడుగునా కుట్ర!
ఈ కేసు కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, అడుగడుగునా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు జరిగిన కుట్ర అని పోలీసు విచారణలో తేలింది. మైనర్ నిందితుడిని కాపాడేందుకు అతని తల్లిదండ్రులు డాక్టర్లతో కుమ్మక్కై బ్లడ్ శాంపిల్స్ మార్చడం, డ్రైవర్‌పై ఒత్తిడి తెచ్చి నేరాన్ని ఒప్పుకోమని చెప్పడం వంటివి దేశవ్యాప్త ఆగ్రహానికి గురిచేశాయి. తండ్రి విశాల్ అగర్వాల్ సుమారు 22 నెలల పాటు జైలులో ఉండి, తాజాగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందారు. కానీ, బయటకు వచ్చిన వెంటనే ఆ కుటుంబం వ్యవహరిస్తున్న తీరు జనం నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటోంది. ప్రకాష్ రాజ్ కూడా ఈ అంశంపై స్పందించారు.
పుణె పోర్షే కేసు ధనవంతుల అహంకారానికి, చట్టం బలహీనతకు నిదర్శనంగా మిగిలిపోతోంది. సామాన్యుడి ప్రాణానికి వెలకట్టలేని స్థితిలో, చట్టం ధనికుల పక్షాన నిలబడుతోందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
