Porsche Crash: పుణేలోని పోర్షే యాక్సిడెంట్ కేసులో (Porsche Accident Case) సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి తాతయ్య సురేంద్ర కుమార్ అగర్వాల్‌కి గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కి లింక్స్ ఉన్నాయని తేలింది. ఇప్పటికే సురేంద్ర ఈ కేసులో విచారణం ఎదుర్కొంటున్నాడు. పుణేలోని కల్యాణి నగర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే..బడా రియల్టర్ కొడుకు కావడం వల్ల విచారణ వేగంగా జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ లోగా నిందితుడి తాతయ్యకి చోటా రాజన్‌కి లింక్స్ ఉన్నాయని తేలడం కీలకంగా మారింది. Central Bureau of Investigation లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం...సురేంద్ర కుమార్ అగర్వాల్‌కి, అతని సోదరుడు ఆర్‌కే అగర్వాల్‌కి ఓ ప్రాపర్టీ విషయంలో విభేదాలొచ్చాయి. ఈ ఇష్యూ సెటిల్‌మెంట్ కోసం సురేంద్ర చోటా రాజన్ మనుషుల్ని ఆశ్రయించాడు. ఆ తరవాత ఆర్‌కే అగర్వాల్ మనుషులపై చోటా రాజన్ గ్యాంగ్ దాడి చేసింది. ఈ ఘటనపై పుణేలోని బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఎస్‌కే అగర్వాల్, చోటా రాజన్ కలిసి హత్యాయత్నం చేశారని FIR నమోదు చేశారు. అంతే కాదు. రాజన్ గ్యాంగ్‌కి డబ్బులు ఇచ్చేందుకు సురేంద్ర కుమార్ అగర్వాల్ బ్యాంకాక్‌కి కూడా వెళ్లినట్టు ఆరోపణలున్నాయి.
చోటా రాజన్‌కి సంబంధించి కేసులన్నింటినీ CBI దర్యాప్తు చేస్తోంది. ముంబయిలోని ఓ స్పెషల్ కోర్టు ఈ కేసులపై విచారణ జరుపుతోంది. అందులో సురేంద్ర కుమార్ అగర్వాల్ కేసు కూడా ఒకటి. అయితే...ఈ కేసుపై పోలీసులు సరైన విధంగా వివరాలు నమోదు చేయలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. సాధారణ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో చాలా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అరెస్ట్ అయిన మైనర్ 15 గంటల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అంత పెద్ద నేరం చేస్తే సింపుల్‌గా బెయిల్ ఇచ్చేస్తారా అంటూ నెటిజన్లు తీవ్రంగా మండి పడ్డారు. అటు ఢిల్లీ పోలీసులు కూడా నిందితుడు మైనర్ కాదని, 17 సంవత్సరాల 8 నెలల వయసున్నందున మేజర్‌గానే పరిగణించి చర్యలు తీసుకునేలా అనుమతినివ్వాలని కోరుతున్నారు. బెయిల్ ఆర్డర్‌నీ రివ్యూ చేయాలని సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. అయితే...కోర్టు జువైనల్ బోర్డుని ఆశ్రయించాలని సూచించింది. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవాలని చూసిన నిందితుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టుకి తీసుకొచ్చే క్రమంలో ఒక్కసారిగా స్థానికులు పోలీస్ వ్యాన్‌పై దాడి చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ వ్యాన్‌పై ఇంక్ చల్లుతూ నిరసన వ్యక్తం చేశారు.
Also Read: Bomb Threat: కేంద్ర హోంశాఖకు బాంబు బెదిరింపు, పార్లమెంట్ వద్ద హైఅలెర్ట్