Porsche Crash Case: పుణేలోని పోర్షే యాక్సిడెంట్ కేసు (Pune car accident case) మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకూ అన్ని విధాలుగా విచారణ చేపట్టిన పోలీసులు...తమ డిపార్ట్‌మెంట్ వాళ్లనీ విచారించనున్నారు. అంటే..పోలీసులే పోలీసులను ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తరవాత పాటించిన ప్రోటోకాల్‌పై ఆరా తీయనున్నారు. రియల్టర్ కొడుకైన నిందితుడికి కొంత మంది పోలీసుల వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారన్న ఆరోపణలు గట్టిగానే వచ్చాయి. కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులే స్వయంగా నిందితుడికి పిజ్జాలు, బర్గర్‌లు తీసుకెళ్లారన్న విమర్శలూ ఉన్నాయి. దీనిపైనా విచారణ అవసరమని భావించిన ACP ఆ పోలీస్ స్టేషన్‌లోని అధికారులందరినీ ప్రశ్నించనున్నారు. ఈ ఘటనపై మొట్ట మొదట కేసు నమోదైన Yerwada పోలీస్ స్టేషన్‌లోనే ఈ విచారణ జరగనుంది. అంత పెద్ద నేరాన్ని చాలా సులువుగా తీసుకోవడంతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్‌లో జాప్యం చేయడమూ అనుమానాలకు దారి తీసింది. శరీరంలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలియాలంటే వెంటనే టెస్ట్ చేయాలి. అలా కాకుండా పోలీసులు ఆలస్యం చేసినట్టు ఆరోపణలున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ACP విచారణ చేపట్టనున్నారు.
అటు రాజకీయంగానూ (Pune Porsche accident case) ఈ ఘటన దుమారం రేపింది. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడికి పిజ్జాలు, బర్గర్‌లు సర్వ్ చేశారంటూ ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు పోస్ట్‌లు కూడా పెట్టారు. అంతే కాదు. జస్టిస్ జువైనల్ బోర్డ్ 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఇవ్వడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. రూ.7,500 పూచీకత్తుతో ఈ బెయిల్ ఇస్తున్నట్టు బోర్డ్ వెల్లడించింది. 15 రోజుల పాటు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకోవాలని, 300 పదాలతో వ్యాసం రాయాలని ఆదేశించింది. అయితే...అంత పెద్ద నేరం చేస్తే ఇంత సులువుగా కండీషనల్ బెయిల్ ఇస్తారా అంటూ చాలా మంది మండి పడ్డారు. ముఖ్యంగా బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఈఘటనపై తీవ్రంగానే స్పందించారు. పేదలకు ఓ రకంగా, ధనికులకు ఓ రకంగా శిక్షలు వేస్తారా అంటూ మండి పడ్డారు. ఇక మైనర్ తండ్రి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. నాలుగైదు కార్లలో ప్రయాణం చేసి పరారవ్వాలని చూశాడు. కానీ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా జాడ కనిపెట్టి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. తన డ్రైవర్‌కి కార్ ఇచ్చి పంపానని, కొడుక్కి తాళాలు ఇవ్వలేదని వాదిస్తున్నాడు నిందితుడి తండ్రి.